మరో 46 మందిని ప్రకటించిన కాంగ్రెస్..
- తమిళనాడులోని విరుద్‌నగర్ నుంచి మాణికం ఠాగూర్, శివగంగ నుంచి కార్తీ
చిదంబరం బరిలోకి - రాయ్‌బరేలీకి అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్
- నాగౌర్ స్థానాన్ని రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి కేటాయింపు
లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే మరో 46 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తుండగా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ్ రాయ్ వారణాసిలో ప్రధాని మోదీని ఎదుర్కోబోతున్నారు. షహరాన్‌పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, హరిద్వార్ నుంచి వీరేందర్ రావత్, అమ్రోహా నుంచి డ్యానిష్ అలీ, కాన్పూర్ నుంచి అలోక్ మిశ్రా వంటివారు బరిలో ఉన్నారు.
కార్తీ చిదంబరం తమిళనాడులోని శివగంగ నుంచి పోటీపడుతుండగా మాణికం ఠాగూర్ విరుద్‌నగర్ నుంచి, ఎస్. జ్యోతిమణి కరూర్ నుంచి పోటీపడుతున్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్ లోక్‌సభ స్థానాన్ని పొత్తులో భాగంగా హనుమాన్ బెనివాల్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి కేటాయించింది. కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియాను మధ్యప్రదేశ్‌లోని రాట్లాం (ఎస్టీ) నుంచి బరిలోకి దింపింది.
2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రకటించిన నాలుగో జాబితాలో మహారాష్ట్రలో నాలుగు, మధ్యప్రదేశ్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 9, తమిళనాడులో 7, జమ్ము, కశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మణిపూర్‌లలో రెండేసి, అస్సాం, అండమాన్ నికోబార్, చత్తీస్‌గఢ్, మిజోరం, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది.