- లిబియాలో 2011 నుంచి రాజకీయ అస్థిర పరిస్థితులు
- తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయి పాలన
- 2014లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఐరాస
- గుర్తించని తూర్పు ప్రాంత పార్లమెంట్
శాంతిభద్రత సమస్యలకు తోడు రాజకీయ అస్థిరతతో అతలాకుతలం అవుతున్న లిబియాలో మరో కలకలం రేగింది. ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా నివాసంపై నిన్న రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని మంత్రి ఒకరు తెలిపారు. పేలుడుతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మోహరించాయి.
2011 నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది. 2014లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే పాలించుకుంటున్నారు. సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్యసమితి 2021లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలో నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ ఆయనను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించకపోవడంతో అస్థిరత కొనసాగుతోంది.