అంతర్రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘా…ఏపీ, తెలంగాణ అధికారుల సమావేశంలో నిర్ణయం …
-పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్ళాలి
- డబ్బు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
- ఎన్‌టీఆర్, ఖమ్మం జిల్లాల అధికారుల మధ్య మంచి సమన్వయం
- ఎథికల్ ఓటింగ్ ప్రాధాన్యంగా ప్రణాళికాయుత చర్యలు
- ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో ప్రలోభాలకు తావులేని వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కృషిచేయడం జరుగుతోందని.. అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి ప్రత్యేక చెక్‌పోస్ట్‌లతో నిఘాను పటిష్టం చేసినట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
గురువారం తిరువూరు, రాజుపేట శ్రీరస్తు కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్‌టీఆర్ జిల్లా, ఖమ్మం జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు జిల్లాల కలెక్టర్లు ఎస్.డిల్లీరావు, వి.పి.గౌతమ్, ఎన్‌టీఆర్ జిల్లా సీపీ కాంతిరాణా టాటా, ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్‌తో పాటు సరిహద్దు నియోజకవర్గాల ఆర్‌వోలు, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఐటీ, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్‌టీ, అటవీ, బ్యాంకింగ్ తదితర శాఖల నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు వెంబడి నగదు, మద్యం, గంజాయి, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విషయంలో ఇప్పటికే తీసుకున్న చర్యలు, కొనసాగించాల్సిన చర్యలు, రెండు జిల్లాల మధ్య సమన్వయం, సహకారంపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ ఎథికల్ ఓటింగ్‌తో పాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రలోభాలకు తావులేని
వాతావరణంలో ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించేందుకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌టీఆర్, ఖమ్మం జిల్లాల సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. రెండు జిల్లాల డీఈవో, సీపీలతో పాటు వివిధ విభాగాల నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సిటిజన్ ఫ్రెండ్లీగా ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. రాజుపేట అష్టలక్ష్మీ టెంపుల్ చెక్‌పోస్టు, గంపలగూడెం రాజవరం చెక్‌పోస్టు, నూతిపాడు చెక్‌పోస్టులతో పాటు అటువైపు ముత్తగూడెం, ఖాజీపురం చెక్‌పోస్టుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే సవాళ్లను రెండు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎదుర్కోనున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్వ్కాడ్స్ బృందాలు (ఎఫ్ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు (ఎస్ఎస్‌టీ) క్రియాశీలంగా పనిచేస్తున్నాయని.. రెండు జిల్లాల ఉన్నతాధికారులు, నోడల్ అధికారులు ఇదేవిధమైన సహకారాన్ని ఎన్నికలు ముగిసేవరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. జిల్లాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్న ఖమ్మం జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.
సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి: సీపీ కాంతిరాణా టాటా
ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మాట్లాడుతూ డబ్బు, మద్యం వంటి వాటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిలువరించేందుకు ఖమ్మం జిల్లా అధికారుల సహాయ సహకారాలతో సరిహద్దు గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. పోలీస్, సెబ్, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, బ్యాంకింగ్ తదితర ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల మధ్య సమన్వయానికి ప్రత్యేక సమాచార మార్పిడి ఏర్పాట్లు చేయడం జరిగిందని.. ప్రస్తుతమున్న చెక్‌పోస్టుల వద్ద నిఘాతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. డబ్బు, మద్యంతో పాటు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరం మేరకు అదనపు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నామని.. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు.
*
ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్‌టీఆర్ జిల్లా నుంచి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం, సమాచార మార్పిడి, డ్రై డే, ఎన్‌ఫోర్స్‌మెంటు తదితరాల్లో మంచి సహకారం లభించిందని.. ఇదే రకమైన సహకారాన్ని ఈ ఎన్నికల సమయంలో ఎన్‌టీఆర్ జిల్లాకు అందించడం జరుగుతుందని తెలిపారు. రెండు జిల్లాల మధ్య పరస్పర సహకారానికి ఈ సమావేశం మంచి వేదిక అని ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు.
ఖమ్మం సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ధన బలం, కండ బలం రహిత శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని.. సరిహద్దు వెంబడి నిఘా విషయంలో రెండు జిల్లాల మధ్య పటిష్ట సమన్వయం ఉన్నట్లు తెలిపారు. స్థానిక అధికారుల సహకారంతో అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డబ్బు, మద్యం, గంజాయి వంటి అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రధాన రహదారులతో పాటు డొంక రూట్ల పైనా దృష్టిసారిస్తున్నట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ జిల్లాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, సీపీ సునీల్ దత్‌లను ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటాలు సత్కరించారు.
సమావేశంలో తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, నందిగామ ఆర్‌డీవో ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట ఆర్‌వో జి.వెంకటేశ్వర్లు, ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు,
ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ నోడల్ అధికారి ఎం.కృష్ణమూర్తినాయుడు, ఎన్నికల వ్యయం నోడల్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్‌డీఎం కె.ప్రియాంక, రెండు జిల్లాల పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, ఎన్నికల వ్యయం, రవాణా తదితర విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.