- రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన శాంతిస్వరూప్
- యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- తెలుగు ప్రజల మనసుల్లో శాంతిస్వరూప్ ది చెరగని స్థానం
తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి పదేళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ పొందారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు …. శాంతిస్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.