- నరసాపురంలో ప్రజాగళం సభ
- వాడివేడిగా చంద్రబాబు ప్రసంగం
- శవ రాజకీయాలు చేసే నీచుడు జగన్ రెడ్డి అంటూ ఫైర్
- చరిత్రలో ఆయన స్థానం ఏంటో చూపిస్తానని వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఏపీ బాగుపడాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని, రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి ఈ జలగ జగన్ మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. ఈ 40 ఏళ్ల కెరీర్ లో నాలాంటి వాడి జోలికి ఎవడూ రాలేదు… ఈ బచ్చా నా జోలికి వచ్చాడు… చూపిస్తా… వదిలిపెట్టేది లేదు… చరిత్రలో ఆయన స్థానం ఏంటో చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇతడ్ని చూస్తే సినిమా నటుడు నాగభూషణం గుర్తొస్తాడు
ఏపీలో రూ.13 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు… మన నెత్తిన అప్పుల కుంపటి ఉంది. నిన్ననే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయింది… ఇవాళ ఐదో తారీఖు… ఉద్యోగులకు జీతాలు వచ్చాయా? రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు వచ్చాయా? నిన్న కూడా వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి, శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్ మోహన్ రెడ్డి.
శవ రాజకీయం అనేది ఈ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. తండ్రి చనిపోతే, తండ్రి లేని బిడ్డను అంటూ సానుభూతి పొందాడు. బాబాయ్ ని ఈయనే చంపేసి, మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు… నాకే ఓటేయండి అని అడిగే పరిస్థితికి వచ్చాడు. ఈయనను చూస్తే నాకు పాత సినిమాల్లో విలన్ నాగభూషణం గుర్తుకు వస్తాడు. వీళ్లే చంపి, వీళ్లే దండేసి, ఆ కేసును ఎదుటివాళ్లపై వేసే రకం వీళ్లు.
రైతుల పరిస్థితి చూస్తే బాధగా ఉంటుంది
రాష్ట్రంలో రైతులు దీనావస్థలో ఉన్నారు, రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోని మిగతా చోట్ల అప్పుల బాధ తక్కువగా ఉంది, కానీ ఏపీలో రైతుల్లో 93 శాతం మంది అప్పుల్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది.
2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేసి పోషకాలు అందించాం. కోస్తాలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేశాం. రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టీకల్చర్ ను ప్రోత్సహించాం, తద్వారా వ్యవసాయాన్ని లాభసాటి చేశాం.
ముష్టి వేశాడు
గత ఎన్నికల ముందు రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పాడు… కానీ ఇచ్చింది రూ.7,500. కేంద్రం రూ.6 వేలు ఇస్తే, ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి రూ.7,500. 2014-19 మధ్య ఏపీ ఆక్వాను దేశంలోనే నెంబర్ వన్ చేశాం. ఇవాళ అన్ని ధరలు పెరిగిపోయాయి. ఫీడ్ ధర పెరిగింది, మందుల ధర పెరిగింది, కరెంటు బిల్లులు, ఏఎంసీ సెస్, నీటి ధర, ట్రాన్స్ ఫార్మర్ రేట్లు పెంచారు… రూ.1.50కే కరెంటు ఇస్తామని చెప్పి, ఇప్పుడు జోన్, నాన్ జోన్ విధానం తెచ్చాడా, లేదా?
నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా… ఎన్టీయే కూటమి వస్తే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తాం, మళ్లీ రూ.1.50కే కరెంటు అందిస్తాం. అన్నదాతను ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం… ఏడాదికి రైతులకు రూ.20 వేలు ఇస్తాం.
పవన్ నిస్వార్థమైన వ్యక్తి
ఇవాళ మూడు పార్టీల నేతలం కలిసికట్టుగా ఇక్కడికి వచ్చాం. ఎవరి కోసం వచ్చాం? రాష్ట్రం పట్ల అభిమానంతో, పేదలకు అండగా ఉండాలన్న ఆలోచనతో, రాజకీయాలు అంటే వ్యాపారం కాదు… సేవాభావం అని చాటిచెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఇక్కడ మా జనసైనికులు ఉన్నారు. వారిలో ఉత్సాహం కనిపిస్తోంది. ఏపీ నష్టపోతోంది, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి, ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా మార్చాలి అని పిలుపునిచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్.
మోదీ నాయకత్వంలో దేశం నెంబర్ వన్ అవ్వడం ఖాయం
రెండో వ్యక్తి నరేంద్ర మోదీ గారు… ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రదేశంగా తయారుచేయాలని అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. 2047 నాటికి భారత్ నెంబర్ వన్ దేశంగా తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయులు అన్ని రంగాల్లో ముందుంటారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అది సాధ్యమవుతుంది.
ఎవరికీ సందేహం అక్కర్లేదు… మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమే. కేంద్రంలో ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావడం ఖాయం. ఇక్కడ మనకి 160కి పైగా సీట్లు రావాలి, 25 పార్లమెంటు స్థానాలు గెలవాలి. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఎన్డీయే అధికారంలోకి రావాలి.
జగన్ రెడ్డీ… గొడ్డలి నీ సింబల్ గా పెట్టుకో
నేను నిన్న కూడా చెప్పాను… వైసీపీ ఫ్యాన్ అరిగిపోయింది. తిరగని ఫ్యాన్ మనకు కావాలా? ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు చేసి డస్ట్ బిన్ లో పడేయాలి. జగన్ రెడ్డీ… ఇక నుంచి నీ సింబల్ గా గొడ్డలి పెట్టుకో. ఇది పులివెందుల కాదు… నరసాపూర్… నరసాపూర్ ఎక్స్ ప్రెస్ స్పీడు పెంచాలి. టీడీపీతో పవన్ కల్యాణ్, బీజేపీ జట్టు కట్టాక కూటమి స్పీడ్ కు తిరుగులేదు.
జగన్ ఇప్పుడు సిద్ధం అంటూ తిరుగుతున్నాడు… జగన్ ను ఓడించడానికి నరసాపురంలో మేం కూడా సిద్ధం. మా మూడు జెండాలు వేరు అయినా అజెండా ఒక్కటే… ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం, మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడం… ఇదే మా అజెండా. మళ్లీ మీ పిల్లలకు భవిష్యత్ ఉండాలంటే ఎన్డీయే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి… మహా ముదురు!
నరసాపురం ఎమ్మెల్యే ఉన్నాడు… ముదునూరి… మహా ముదురు… మామూలు ముదురు కాదు సర్వం దోచేసిన మహా ముదురు. ఏటి గట్టు పనుల నాసిరకంగా చేయడంతో అన్నీ కొట్టుకునిపోయాయి. మెడికల్ కాలేజి వస్తుందని అందరినీ నమ్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. మెడికల్ కాలేజి వచ్చిందా అని అడుగుతున్నా?
ఇసుక అక్రమ రవాణాతో రూ.30 కోట్లు సంపాదించాడీ మహా ముదురు! లే అవుట్ వేయాలంటే ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే. జగన్ రెడ్డీ… నువ్వు నేర్పించిన ఆనవాయతీ ఇది! అందుకే ఈసారి కూటమి అభ్యర్థిగా జనసేన నేత బొమ్మిడి నాయకర్ ను గెలిపించండి” అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.