- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
- ఇలా మోసపోకండమ్మా అంటూ బాధితుడి ఆవేదన
- కుటుంబమంతా కన్నీరు పెడుతున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
అల్లారుముద్దుగా పెంచిన కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఓ తండ్రి తీవ్ర వేదనకు గురయ్యాడు. కూతురిపై ఉన్న ప్రేమను చంపుకుని, తన కూతురు చనిపోయిందంటూ ఫ్లెక్సీ వేయించి అశ్రునివాళి తెలిపాడు. ఇంటి ముందు గోడకు ఫ్లెక్సీని అతికించి తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరే తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదని, అయ్యలారా, అమ్మలారా జాగ్రత్తగా మీ పిల్లలను కాపాడుకోండని చెప్పాడు. బిడ్డలారా మీరు మోసపోవద్దు, మీ తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూషను ఆమె తండ్రి అల్లారుముద్దుగా పెంచాడు. చిన్నప్పటి నుంచీ కూతురు అడిగినవేవీ కాదనకుండా కష్టమైనా కొనిచ్చాడు. ప్రేమగా చూసుకుంటూ తన బిడ్డ భవిష్యత్తు కోసం మంచి కాలేజీలో చేర్పించాడు. బీటెక్ చదువుతున్న అనూష కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో గొడవ జరిగింది. ఆ యువకుడిని మర్చిపోవాలని తండ్రి బెదిరించినా, బుజ్జగించినా వినిపించుకోలేదు. ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది.
కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. మాయమాటలకు తన బిడ్డ మోసపోయిందని ఆవేదన చెందాడు. ఆపై తన బిడ్డ చనిపోయిందంటూ బంధుమిత్రులకు సమాచారం ఇచ్చాడు. అశ్రునివాళి పేరుతో ఓ ఫ్లెక్సీ ప్రింట్ చేయించి తన ఇంటి ముందు గోడకు అతికించాడు. ఆ ఫ్లెక్సీ పక్కనే కూర్చుని మోసగాళ్లు చెప్పే మాయమాటలను నమ్మి తన బిడ్డలాగా చేయొద్దంటూ అమ్మాయిలకు ఆవేదనతో విజ్ఞప్తి చేశాడు.