- వేసవి రద్దీ తట్టుకునేలా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు
- పశ్చిమ బెంగాల్‌లోని షాలీమార్, సాంత్రాగాఛి, కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు
- ఏప్రిల్ నుంచి జూన్ వరకు అందుబాటులో సర్వీసులు
వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. బెంగాల్‌లోని షాలిమార్, సాంత్రాగాఛిలకు, కేరళలోని కొల్లంకు ఈ రైలు సర్వీసులను ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ – సాంత్రగాఛి (07223) రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకూ 11 ట్రిప్పులకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ప్రతి శనివారం తిరుగుప్రయాణమయ్యే సాంత్రాగాఛి-సికింద్రాబాద్ (07224) రైలుకు సంబంధించి ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకూ 11 ట్రిప్పులు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
సికింద్రాబాద్ – షాలీమార్ (07225) ప్రత్యేక రైలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం.. షాలీమార్ – సికింద్రాబాద్ (07226) రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకూ ప్రతి మంగళవారం బయల్దేరతాయి. ఒక్కో రైలును మొత్తం 11 ట్రిప్పుల మేర నడపనున్నారు. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, సాంత్రాగాఛి మీదుగా ప్రయాణిస్తాయి.
సికింద్రాబాద్ – కొల్లం మధ్య రానుపోను 22 ట్రిప్పులను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ – కొల్లం (07193) ప్రత్యేక రైలు ఏప్రిల్ 17, 24 మే 1, 8, 15, 22, 29 జూన్ 5,18, 19, 26 తేదీల్లో బయల్దేరుతుంది. తిరుగుప్రయాణంలో కొల్లం – సికింద్రాబాద్ (07194) రైలు ఏప్రిల్ 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో బయల్దేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.