- అవినాశ్ ఎదుగుదలను షర్మిల, సునీత ఓర్చుకోలేకపోతున్నారన్న విమల
- జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపాటు
- షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని వ్యాఖ్య
వివేకానందరెడ్డి హత్య విషయంలో సీఎం జగన్, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ షర్మిల, సునీత విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు నిందితుడు అవినాశ్ కు జగన్ మళ్లీ ఎంపీ టికెట్ ఇస్తున్నారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల, సునీతలపై వారి మేనత్త వైఎస్ విమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారని విమల అన్నారు. ఇద్దరూ ఇకనైనా నోరు మూసుకుని ఉండాలని మేనత్తగా చెపుతున్నానని హెచ్చరించారు.
వైఎస్ ఉన్నప్పుడు కడపను వివేకానందరెడ్డి చూసుకున్నారని… ఇప్పుడు అవినాశ్ చూసుకుంటున్నారని విమల చెప్పారు. వైఎస్ ను ఇబ్బంది పెట్టిన వాళ్లంతా ఇప్పుడు షర్మిల పక్కన ఉన్నారని మండిపడ్డారు. షర్మిల, సునీతకు దైవభక్తి కూడా లేకుండా పోయిందని చెప్పారు. వీరిద్దరికీ తాను సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటి నుంచి… వాళ్లు తనతో మాట్లాడటం కూడా మానేశారని తెలిపారు.
అవినాశ్ రాజకీయంగా ఎదగడాన్ని షర్మిల, సునీత ఓర్చుకోలేకపోతున్నారని విమల చెప్పారు. అవినాశ్ గెలవాలని వివేకా చివరి రోజు వరకు పని చేశారని తెలిపారు. జగన్ ను, అవినాశ్ ను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని షర్మిల చేస్తున్నారని… ఆమె మాటలను నమ్మొద్దని చెప్పారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరినీ గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియోను చూశానని… షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బంధువులను ప్రభుత్వానికి దూరంగా ఉంచారని… ప్రభుత్వ వ్యవహారాల్లో బంధువుల జోక్యం ఉండరాదని భావించారని విమల చెప్పారు. వాళ్ల పనులు కావడం లేదనే షర్మిల, సునీత ఇలా వ్యవహరిస్తున్నారని తాను భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటికైనా ఇద్దరూ మారాలని మేనత్తగా చెపుతున్నానని అన్నారు. పేదల కోసం జగన్ ఎంతో చేస్తున్నారని… పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం తప్పు అని వ్యాఖ్యానించారు. మీరు చేస్తున్న పనుల వల్ల వైఎస్ ఆత్మ కూడా సంతోషంగా ఉందని అన్నారు.
షర్మిల, సునీత వల్ల కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారు.. కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారు: మేనత్త విమల
వైఎస్ షర్మిల, సునీతలపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంటి ఆడపిల్లలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని బజారుపాలు చేయడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. వారి వ్యాఖ్యలను భరించలేకపోతున్నానని అన్నారు. వివేకానందరెడ్డిని వైఎస్ అవినాశ్ రెడ్డి హత్య చేయడాన్ని వీరు చూశారా? అని ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో వీళ్లే డిసైడ్ చేసేస్తే… ఇంక కోర్టులు, జడ్జిలు ఎందుకని అడిగారు. హత్య చేసిన వాడు బయట తిరుగుతున్నాడని…. అతను చెప్పిన మాటలు విని అవినాశ్ పై ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు.
వివేకా హత్య అంశంలోకి జగన్ ను కూడా లాగుతున్నారని విమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారని విమర్శించారు. అవినాశ్ కు కూడా ఒక కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఏ పాపం చేయని తన సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాది కాలంగా జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీత చేస్తున్న పనుల వల్ల తమ కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నారని చెప్పారు. శత్రువులంతా ఒక్కటైనప్పుడు సొంత కుటుంబ సభ్యుడికి అందరూ తోడుగా ఉండాలని అన్నారు.
వివేకానందరెడ్డి అంటే షర్మిల, సునీత కంటే తనకే ఎక్కువ ఇష్టమని విమల తెలిపారు. జగన్ పై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి ఫ్యాక్షన్ కు దూరంగా ఉన్నారని.. రాజారెడ్డిని చంపినా ప్రతీకారం తీర్చుకోలేదని చెప్పారు. మనుషులను చంపేంత క్రూరత్వం తమ కుటుంబంలో లేదని అన్నారు. తమ ఇంట్లోని ఆడపిల్లలు ఇలా తయారు కావడం బాధ కలిగిస్తోందని చెప్పారు.