- తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్న కేసీఆర్
- కాంగ్రెస్ ప్రలోభాల వల్ల అధికారంలోకి వచ్చిందని విమర్శ
- కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు
‘దర్యాఫ్తు సంస్థలను పంపించి కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోంది… ఇదేనా రాజకీయమంటే’ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. అయితే మోదీ, లేదంటే ఈడీ అన్నట్లుగా బీజేపీ తీరు ఉందన్నారు. శనివారం చేవెళ్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ…. చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేస్తున్నవారు గతంలో మన పార్టీ తరఫునే గెలిచారన్నారు. వారెవరో తెలియని సమయంలో మనం వారిని గెలిపించామన్నారు. వారు పార్టీ ఎందుకు మారారో చెప్పాలని నిలదీశారు. అధికారం, పదవి… దేని కోసం బీఆర్ఎస్‌ను వదిలి పెట్టారో చెప్పాలన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని విమర్శించారు. బీజేపీ పదేళ్ల కాలంలో తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల రాలేదని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదని మండిపడ్డారు. ఒక్క కాలేజీ ఇవ్వని బీజేపీకి మనం ఎందుకు ఓటు వేయాలి? అని నిలదీశారు. పెట్రోల్, డీజిల్ సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ తన మెడపై కత్తి పెట్టినా మనం తగ్గలేదన్నారు. ఇప్పుడు కూడా మీటర్లు రాకూడదంటే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలని సూచించారు. అన్ని లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. నాలుగు నెలలు అయినా రైతుబీమా, రైతుబంధు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు లూటీలు మొదలు పెట్టిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పిందని… కానీ కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. పంటకు బోనస్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రలోభాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అంబేడ్కర్ ముందుచూపు కారణంగానే తెలంగాణ సాకారమైందని కేసీఆర్ అన్నారు. రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. అందుకే రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు.