- గత రాత్రి విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర
- సింగ్ నగర్ వద్ద రాయితో దాడి… సీఎం జగన్ కంటి పైభాగంలో గాయం
- చేతితో విసిరి ఉంటే రాయి అంత బలంగా తగలదన్న సజ్జల
- ఎయిర్ గన్ ఉపయోగించి ఉంటారని అనుమానాలు
- ఇది పక్కా ప్లాన్ తో చేసిన హత్యాయత్నం అంటూ ఆరోపణలు
సీఎం జగన్ పై గత రాత్రి విజయవాడ సింగ్ నగర్ వద్ద రాయితో దాడి జరగడం, సీఎం జగన్ కు ఎడమ కంటి పై భాగంలో గాయం కావడం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
రాయి చేతితో విసిరి ఉంటే అంత బలంగా తగలదని, బహుశా ఎయిర్ గన్ వంటిది ఉపయోగించి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రాయి కొంచెం పక్కకి తగిలి ఉంటే ప్రాణం పోయేది… కొంచెం కిందికి తగిలి ఉంటే కన్ను పోయేది అని సజ్జల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఏదేమైనా, ఇది ఆకతాయిలు చేసిన పని మాత్రం కాదని, పక్కా ప్లాన్ తో చేసిన హత్యాయత్నం అని ఆరోపించారు. కానీ, టీడీపీ నేతలు ఇదంతా డ్రామా అంటున్నారని, భద్రతా వైఫల్యం అని పచ్చ మీడియా అంటోందని మండిపడ్డారు. వారు కడుపుకు అన్నం తింటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని, అందుకే చంద్రబాబు కొట్టండి అంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకంలో రాశారని వివరించారు.
సానుభూతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం జగన్ కు లేదని, గతంలో అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు సానుభూతి కోసం ఎలా నటించాడన్నది ఇంకా ఎవరూ మర్చిపోలేదని అన్నారు.