- శ్రీరామ రక్షాస్తోత్రమ్ పుస్తకం రచించిన పురాణపండ శ్రీనివాస్
- తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరాముడి ఆలయాల్లో ఉచితంగా వితరణ
- ఆయా ఆలయాలకు చేర్చడంలో కృషి చేసిన బొల్లినేని కృష్ణయ్య
- భద్రాద్రిలో రేపు 30 వేల ప్రతుల వితరణ
- రచయిత పురాణపండపై ప్రశంసల వర్షం
తరతరాలుగా అద్భుతాల్ని ఆవిష్కరించిన ‘శ్రీరామ రక్షాస్తోత్రమ్’ మొక్కుబడి పుస్తకం కాదని వేద పాఠశాలల విద్యార్థులు, భద్రాద్రి సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల అర్చకులు పేర్కొన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ఈ పుస్తకాన్ని శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలం సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో ఉచిత వితరణ చేశారు. మాజీమంత్రి, కిమ్స్ ఆసుపత్రుల వ్యవస్థాపకుడు బొల్లినేని కృష్ణయ్య వీటిని ఆలయాలకు చేర్చడంలో కృషి చేశారు.
శ్రీరామ రక్షాస్తోత్రమ్‌లో రఘురాముని అభయాన్ని వర్షించే శ్రీరామ అపదుద్దారక స్తోత్రం, భయాన్ని తొలగించే కోదండ రామస్త్ర స్తోత్రం, మహావీర హనుమంతుని పరాక్రమ సౌందర్యంతో రక్షించే శ్రీ మారుతీ స్తోత్రం, శ్రీ ఆంజనేయభగవానుని విశేషానుగ్రహాన్నిచ్చే హనుమాన్ చాలీసాలకు అద్భుతమైన భాషతో కూడిన వ్యాఖ్యానం ఉంది. పురాణపండ రెండున్నర దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని, తమ పుస్తకాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని వేదపండితులు, అర్చకులు కొనియాడారు.
రచయిత పురాణపండ మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి ముందే భద్రాచలం సహా అనేక జిల్లాల్లో ఈ పుస్తకం భక్తుల చేతుల్లో కనిపించడం, అప్పుడు పారాయణం మొదలుపెట్టడం చూస్తుంటే అదంతా శ్రీరాముడి అనుగ్రహమేనని పేర్కొన్నారు. ఆలయాలకు, వేద పాఠశాలలకు, సాంస్కృతిక సంస్థలకు, భక్త సమాజాలకు ఈ శ్రీరామరక్షా స్తోత్ర గ్రంథాన్ని ఉచితంగా అందించాలని ప్రఖ్యాత ఆధ్యాత్మిక ధార్మిక సంస్థ ‘ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ‘ సంకల్పించడం శుభపరిణామమని పేర్కొన్నారు.
కాగా, శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే రామయ్య కల్యాణంలో పాలుపంచుకునే దంపతులు, ఉభయదాతలు, భక్తులకు 30 వేల శ్రీరామ రక్షాస్తోత్రమ్ ప్రతులను అందించనున్నట్టు శ్రీ సీతారామ చంద్ర దేవస్థాన జాయింట్ కమిషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి ప్రకటించారు.