- ఇటీవల చిలకలూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ
- ఏపీలో మే 13న ఎన్నికలు
- ప్రచారం ముమ్మరం చేయాలని కూటమి నిర్ణయం
- 4 సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ… చంద్రబాబు, పవన్ కూడా హాజరు
- ఒకట్రెండు రోజుల్లో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
ఒక పక్క ఏపీ సీఎం జగన్ ఒంటరిగా రాష్ట్ర వ్యాపితంగా విస్తృత పర్యటనలు చేస్తుండగా టీడీపీ ,జనసేన , బీజేపీ కూటమి నేతలు ఐక్యంగా ,విడివిడిగా ప్రచారం చేస్తున్నారు …నేతల మధ్య మాటల తూటాలు మిస్సైళ్ళలా పేలుతున్నాయి…పోటాపోటీగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మాటలు హద్దులు దాటుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..జగన్ ఓడించడానికి కూటమి కట్టిన మూడు పార్టీల నేతలు తమ ప్రచారం నమ్మకంలేకనో లేక మరింత ప్రచారం చేయాలనో కానీ ప్రధాని మోడీ పర్యటనల కోసం ఎదురు చూస్తున్నారు …
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమి కట్టిన నేపథ్యంలో, ఇప్పటికే ఓసారి ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ… త్వరలో మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఎన్డీయే కూటమి తరఫున ఏపీలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరో ప్రాంతంలో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. ఈ సభల్లో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు.
ప్రధాని రాష్ట్రానికి వచ్చే లోపు వీలైనన్ని సభలతో ఉమ్మడి ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ నెల 24న రాయలసీమలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. రాజంపేట, రైల్వే కోడూరులో నిర్వహించే ప్రజాగళం, వారాహి విజయభేరి సభల్లో పాల్గొంటారు.
రేపు (ఏప్రిల్ 19) ఆలూరు, రాయదుర్గం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు జరపనున్నారు. ఈ నెల 20న గూడూరు, సర్వేపల్లి, సత్యవేడులో చంద్రబాబు పర్యటించనున్నారు.
దేశంలో నాలుగో విడత ఎన్నికల కోసం నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగో విడతలో భాగంగా ఏపీలో మే 13న ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో ఎన్నికలకు కొన్ని వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రచారం ముమ్మరం చేయాలని కూటమి భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీని రాష్ట్రానికి రప్పిస్తున్నారు. మోదీ సభల షెడ్యూల్ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు.