Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా…

  • రంగురంగుల మబ్బులు, తుపానులు జుపిటర్ వాతావరణాన్ని చుట్టేస్తున్న వైనం
  • కొన్ని దశాబ్దాలు లేదా శతాబ్దాల వరకు తుపాన్లు కొనసాగుతాయన్న నాసా
  • 13,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు తీసిన జునో స్పేస్ క్రాఫ్ట్

మన సౌర మండలంలోనే అతిపెద్దదైన గురు గ్రహంపై పెను తుపాను ఏర్పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా విడుదల చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వాటిని పోస్ట్ చేసింది. “సూర్యుడి నుంచి ఐదో గ్రహమైన జుపిటర్ పై ఏర్పడిన తుపానులు ఇవి.. ఇలా మొత్తం గ్రహాన్ని చుట్టుముట్టేశాయి. మన జునో మిషన్ ఈ ఫొటోలను తీసింది. గురుగ్రహంపై ఘన ఉపరితల ప్రదేశం ఏదీ లేనందువల్ల ఇక్కడి తుపానులు కొన్నేళ్లు, దశాబ్దాలు లేదా కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతాయి. గంటకు 643 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి” అని నాసా ఆ ఫొటోలకు జత చేసిన క్యాప్షన్ లో రాసుకొచ్చింది.

“జుపిటర్ పై వీచే బలమైన గాలుల మధ్య నుంచి ఈ పెను తుపానును జునో ఫొటో తీసింది. ఆ సమయంలో జునో గురు గ్రహంపై ఉండే భారీ వాయు మబ్బులకు 13,000 కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తోంది. అక్కడి పెను గాలుల్లో అమ్మోనియా, నీరు ఉంటాయి. హైడ్రోజన్, హీలియం ఎక్కువగా ఉండే గురుడి వాతావరణాన్ని ఈ గాలులు చుట్టేస్తుంటాయి” అని మరో క్యాప్షన్ జత చేసింది.

నాసా షేర్ చేసిన ఫొటోల్లో నీలం, తెలుపు, మచ్చలతో ఉన్న మబ్బులు, తుపానులు జుపిటర్ వాతావరణాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన వెంటనే ఈ ఫొటోలకు 2,80,726 లైక్ లు వచ్చాయి. అలాగే భారీ సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు పోస్టు చేశారు. గురుగ్రహంపై అన్వేషణకు నాసా ప్రయోగించిన జునో స్పేస్ క్రాఫ్ట్ గతంలో ఆ గ్రహంపై గ్రేట్ రెడ్ స్పాట్ ఫొటోను 13,917 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసింది. భూమికి రెండింతల సైజులో ఉన్న ద గ్రేట్ రెడ్ స్పాట్ ఒక తుపాను. ఈ తుపాను గత 350 ఏళ్లుగా కొనసాగుతోంది.

Related posts

పొరపాటున పాలస్తీనా సిటీలోకి ఎంటరైన ఇజ్రాయెల్ డ్రైవర్.. కారును తగలబెట్టిన పౌరులు.. !

Ram Narayana

వియ్యంకుడికి కీలక పదవిని కట్టబెడుతున్న ట్రంప్!

Ram Narayana

నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో కంపించిన భూమి

Ram Narayana

Leave a Comment