Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

భారత ఎన్నికల ప్రశ్నలపై ప్రముఖ ఏఐ చాట్ బాట్ ల మౌనం!

  • రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాల దాటవేత
  • ఎన్నికల వెబ్ సైట్ ను సందర్శించాలని బదులిస్తున్న మెటా ఏఐ!
  • ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా నేర్చుకుంటున్నట్లు చెబుతున్న గూగుల్ జెమినీ!
  • వీటిపై అసలు సమాధానాలే ఇవ్వని చాట్ జీపీటీ

సాధారణంగా కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే చాట్ బాట్ లు మనం అడిగిన ప్రశ్నలకు టక్కున బదులిస్తాయి. కానీ మెటా ఇటీవల భారత్ లో ప్రారంభించిన మెటా ఏఐ చాట్ బాట్ తోపాటు చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ లాంటి చాట్ బాట్ లు ప్రస్తుతం మౌనం దాల్చాయి! భారత రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నాయి! 

ముఖ్యంగా మెటా ఏఐని రాజకీయ పార్టీలు, నేతల గురించి ఎన్నిసార్లు అడిగినా దయచేసి ఎన్నికల సంఘం వెబ్ సైట్ ను సందర్శించాలని సూచిస్తోంది. ‘మీరు అడిగిన ప్రశ్న సాధారణ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ప్రముఖుడిది. దయచేసి https://elections24.eci.gov.in ను సందర్శించండి’ అంటూ ఈసీ వెబ్ సైట్ లింక్ ను చూపుతోంది. 

ఇక గూగుల్ జెమినీని ఈ తరహా ప్రశ్నలు అడిగితే “ఈ ప్రశ్నకు జవాబు ఎలా చెప్పాలో నేనింకా నేర్చుకుంటున్నా. ఈలోగా సమాధానం కోసం గూగుల్ సెర్చ్ ప్రయత్నించండి” అంటూ బదులిస్తోంది. ఇక ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ.. భారత ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇవ్వట్లేదు. మరోవైపు మైక్రో సాఫ్ట్ తయారు చేసిన కోపైలట్ చాట్ బాట్ మాత్రం ఎన్నికల సంబంధ ప్రశ్నలకు బదులిస్తోంది. కానీ ఏయే వెబ్ సైట్లలో ఎన్నికల ప్రశ్నలకు సంబంధించిన సమాచారం లభిస్తుందో వాటినే తన సమాధానంగా టైప్ చేస్తోంది. గ్యాడ్జెట్స్ 360 వెబ్ సైట్ చేపట్టిన పరిశోధనలో ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. 

ఎందుకిలా?
గ్యాడ్జెట్స్ 360 వెబ్ సైట్ దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అదేమిటంటే.. దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ ప్రశ్నలకు సమాధానాలను తమ చాట్ బాట్ చెప్పకుండా నియంత్రిస్తున్నట్లు మెటా పేర్కొందని వెబ్ సైట్ తెలిపింది. పొరపాటున తప్పుదోవ పట్టించే సమాచారం ఇస్తుందేమోనన్న ఉద్దేశంతో అలాంటి ప్రశ్నలకు బదులివ్వకుండా చూస్తున్నట్లు మెటా చెప్పిందని తన కథనంలో వెల్లడించింది.

మెటా ఏఐ పొరపాట్లు
మెటా ఏఐని పరీక్షించే సమయంలో దానిలో కొన్ని లోపాలు కూడా బయటపడ్డట్లు గ్యాడ్జెట్స్ 360 వెబ్ సైట్ తెలిపింది. విపక్ష ఇండియా కూటమి గురించి అడిగినప్పుడు మాత్రం మెటా ఏఐ వివరంగా సమాధానం ఇచ్చిందని పేర్కొంది. కూటమి ఎప్పుడు ఏర్పడింది, అందులోని పార్టీలు ఏమిటి, కూటమి లక్ష్యం ఏమిటనే ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇచ్చిందని వెబ్ సైట్ చెప్పింది. కానీ కొందరు రాజకీయ నాయకుల గురించి ప్రశ్నించగా చాట్ బాట్ తొలుత సమాధానాలను టైప్ చేసిందని, కానీ చివరకు దాన్ని డిలీట్ చేసుకొని ఎన్నికల సంఘం వెబ్ సైట్ ను సందర్శించాలని కోరిందని వివరించింది. దీనిపై మెటా ప్రతినిధి స్పందిస్తూ.. ఇదో కొత్త టెక్నాలజీ అని, మనం అడిగిన వెంటనే ప్రతిసారీ సమాధానం రాకపోవచ్చని చెప్పారు. తమ చాట్ బాట్ మోడళ్లకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ విడుదల చేసి వాటిని మెరుగుపరుస్తున్నామని వివరించారు.

Related posts

ఆ కాంట్రవర్సీ జోలికి వెళ్లదలుచుకోలేదు: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

Ram Narayana

పారిస్ ఒలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో పతకం

Ram Narayana

ఇది బీజేపీ అసలు బండారం గాంధీని చంపినా గాడ్సే విలువైన బిడ్డనట …కేంద్ర మంత్రి కితాబు ..

Drukpadam

Leave a Comment