Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

అవసరానికి భార్య స్త్రీధనం తీసుకుంటే భర్త దాన్ని తిరిగిచ్చేయాలి: సుప్రీం కోర్టు

  • పుట్టింటివారు ఇచ్చిన బంగారు నాణేలు భర్త తనకు చెప్పకుండా వాడేశాడన్న మహిళ
  • తన స్త్రీధనం తనకు తిరిగిప్పించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైనం
  • కేసులో తాజాగా తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం
  • అవసరానికి తీసుకున్న భార్య డబ్బును తిరిగివ్వాల్సిన నైతిక బాధ్యత భర్తదని వ్యాఖ్య 
  • భార్య సొమ్ము వాడుకున్నందుకు పరిహారం కలుపుకుని రూ.25 లక్షలు చెల్లించాలని భర్తకు ఆదేశం

స్త్రీధనంపై పూర్తి హక్కు మహిళలదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దానిపై భర్తకు నియంత్రణ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘‘స్త్రీధనం అనేది సంబంధిత మహిళలకు చెందిన పూర్తి ఆస్తి, దాన్ని ఆమె ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు’’ అని పేర్కొంది. కష్టకాలంలో భర్త తన భార్య స్త్రీధనాన్ని తీసుకున్నా దాన్ని తిరిగి ఆమెకు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని స్పష్టం చేసింది. 

కేసు పూర్వాపరాల్లోకి వెళితే,  కేరళకు చెందిన ఓ మహిళకు 2009లో వివాహమైంది. పెళ్లి సమయంలో మహిళ కుటుంబం ఆమెకు 89 బంగారు నాణేలను ఇచ్చింది. భర్తకు రూ.2 లక్షల చెక్కును అందజేసింది. పెళ్లయిన మరుసటి రోజు ఆ బంగారు నాణేలను భద్రంగా ఉంచుతానని నమ్మబలికిన భర్త.. వాటిని తీసుకెళ్లి తన తల్లికి అప్పగించాడు. అనంతరం, తన అప్పులు కట్టుకోవడానికి వాటిని అమ్మేశాడు. కొన్ని రోజుల తరువాత ఈ విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్త నుంచి తన బంగారాన్ని తిరిగి ఇప్పించాలంటూ సదరు మహిళ కేరళ హైకోర్టులో పిటిషన్ వేయగా చుక్కెదురైంది. తన బంగారాన్ని భర్త, అత్త దుర్వినియోగం చేశారనేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. 

తన స్త్రీధనం పొందేందుకు చివరి ప్రయత్నంగా ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. ‘‘2009లో 89 బంగారు నాణేల రేటు రూ.8.90 లక్షలు ఉండేది. ఆనాడు వాటిని తీసుకుని వాడుకున్నందుకు పరిహారంతో కలుపుకుని రూ.25 లక్షలను భార్యకు భర్త చెల్లించాలి. ఈ పేమెంట్ ఆరు నెలల్లోగా జరగాలి’’ అని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Related posts

మేం బెయిల్ ఇచ్చాం… మీరు మరుసటి రోజే మంత్రి అయ్యారు… ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు

Ram Narayana

బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు…

Ram Narayana

మనీశ్ సిసోడియాకు బెయిల్.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

Leave a Comment