Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పాపం నామ నాగేశ్వరావు అమాయకుడు ,కేసీఆర్ మాయలోపడ్డాడు …సిపిఐ నేత నారాయణ

పాపం నామ నాగేశ్వరరావు అమాయకుడు ,కేసీఆర్ మాయలోపడ్డారు…కేసీఆర్ మాటలను నమ్మే స్థితిలో జనంలేరని ,బీఆర్ యస్ కు కాలంచెల్లిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ దుయ్యబట్టారు …గురువారం ఖమ్మం యస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన సిపిఐ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ కేంద్రంలోని మోడీ ,రాష్ట్రాల్లోని బీఆర్ యస్ విధానాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు …బీఆర్ యస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పట్ల జాలి చూపిస్తూనే ఆయన కేసీఆర్ మాయలో పడ్డాడని నవ్వులు పూయించారు …ఇప్పటికే ఇద్దరు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను జైళ్లలో పెట్టిన కేంద్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలనీ చూస్తుందని అదే జరిగితే బీజేపీకి పుట్టగతులు ఉండవని నారాయణ హెచ్చరించారు …

మోడీ దత్త పుత్రులైనా అంబానీ, అదానీలతో పాటు 29 మంది కార్పొరేట్ శక్తుల కోసమే పాలన సాగిస్తున్నారని రూ. 14 లక్షల కోట్ల ఎగవేసిన వీరిని మోడీ ప్రభుత్వం కాపాడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ప్రధాని మోడీ తనకు కుటుంబం లేదు, అవినీతి చేయను అంటున్నారని కానీ దత్తపుత్రులంతా అవినీతిపరులేనని ఇందులో ఆరుగురు మోడీ పేరుతోనే ఉండడం గమనార్హమన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థాయి సిపిఐ కార్యకర్తల సమావేశం గురువారం స్థానిక ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజక వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ మోడీ మాటలు భవిష్యత్తు ప్రమాదానికి అద్దం పడుతున్నాయని మోడీ తీరును ప్రగతిశీల కాముకులు, మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తప్పుబడుతున్నారని మోడీ కోరుతున్న 400 సీట్లు ఇస్తే రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయని ఇక ప్రజాస్వామ్యం ఉండదని హిట్లర్ పాలన కొనసాగుతుందన్నారు. మోడీ దిగజారుడు వ్యాఖ్యలు ఆయన ఓటమి తెలియజేస్తున్నాయని హిందువుల మంగళ సూత్రాలు ముస్లింలకు పంచుతారన్న వ్యాఖ్యలు ఆయన భయాన్ని తెలియజేస్తున్నాయని నారాయణ అన్నారు . మంగళసూత్రాలపై నమ్మకం లేని వ్యక్తి మంగళసూత్రాల గొప్పతనాన్ని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కుటుంబాన్ని మోసం చేసిన వాడు దేశాన్ని మోసం చేస్తారని ఆయన తెలిపారు. మోడీ కుటుంబాన్ని మోసం చేశారని ఇక దేశాన్ని మోసం చేసే కుట్రకు తెరలేపారన్నారు. తమకు ఇష్టమైన వారు ఏ తప్పు చేసిన బిజెపి మాట్లాడదని జగన్ లక్షల కోట్లు దోచుకుని పదేళ్లుగా బెయిల్ పై ఉన్న బిజెపికి దత్త పుత్రుడు కాబట్టి పట్టించుకోవడం లేదన్నారు.

ఉత్తరాదిన బిజెపికి సీట్లు తగ్గుతున్నాయని అధికారంలోకి రావడం కల్లేనన్నారు. యేటా రెండు కోట్ల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సిన బిజెపి ఆ పని చేయలేదని ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం 1.75 కోట్ల ఉద్యోగాలకు అవకాశం కల్పించారన్నారు.కానీ అందులో వాస్తవం లేదన్నారు. పబ్లిక్ సెక్టార్ను విక్రయిస్తూ కోట్లాది ఉద్యోగాలను ఊడగొడుతున్నారని నారాయణ తెలిపారు. 29 మంది రూ. 14 లక్షల కోట్లు ఎగవేస్తే అందులో 25 మంది గుజరాతీయులేనని ఆయన ఆరోపించారు. సామాన్యులు వినియోగించే చెప్పుల పైన పన్నును ఐదు నుంచి 18 శాతం పెంచిన బిజెపి కార్పొరేట్ పన్నును మాత్రం 33 నుంచి 27 శాతానికి తగ్గించిందన్నారు. లక్షల కోట్లు ఎగవేసిన 29 మందిలో ఒక్క ముస్లింమైన ఉన్నారా అని నారాయణ ప్రశ్నించారు. బిఆర్ఎస్ఈ ఊగిసలాటని బిజెపిది భయాందోళన అని ఒక్క ఓటుతో రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని నారాయణ పిలుపునిచ్చారు.

ఎర్రజెండాల స్ఫూర్తితోనే రాజకీయాలు ప్రారంభించానని ఆ స్ఫూర్తితోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ సిపిఐ, సిపిఎంతో నాది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని జాతీయ రాజకీయాల దృష్ట్యా అప్పుడప్పుడు కాస్త దూరమైనా కమ్యూనిస్టులతో చెలిమి మాత్రం కొనసాగుతుందని తుమ్మల తెలిపారు. ఖమ్మంజిల్లాలో ఎర్రజెండాల రెప రెపల వెనక అనేక మంది త్యాగాలు ఉన్నాయని బడుగు, బలహీన వర్గాల కోసం ఆస్తులను అమ్మి కమ్యూనిస్టులు సేవ చేశారన్నారు. రజక్అలాంటి వ్యక్తుల సేవతో పేదల గుండెల్లో ఎర్రజెండా నిలిచిపోయిందని కమ్యూనిస్టులు కలిసి ఉన్న లేకున్నా జిల్లా అభివృద్ధిని మాత్రం ఆపలేదన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, మంచినీరు కోసమే ఎర్ర జెండా పోరాటం చేసిందని ఇప్పుడా బాధ్యతను తాను తీసుకుని పేదల కోసం ఈ అధికారాన్ని ఉపయోగపెడతామన్నారు. ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎంలు కలిసి పని చేస్తున్నాయని ఖమ్మంజిల్లాలో కూటమి ఘన విజయం సాధిస్తుందని మతతత్వ బిజెపిని ఓడించేందుకు కలిసి రావాలని ప్రతి ఓటు చేతి గుర్తుకు వేసేలా కమ్యూనిస్టు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గోదావరి జలాలతో ఖమ్మంజిల్లా సస్యశ్యామలం కావాలంటే పెద్ద మెజార్టీతో పార్లమెంటుఅభ్యర్థిని గెలిపించాలన్నారు. తుమ్మల కాంగ్రెస్ వామపక్షాల ఐక్యత వర్ధిలాలి అంటూ నినదించారు.

బిజెపితో బిఆర్ఎస్ పొత్తు పరోక్షం కాదు ప్రత్యక్షమేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కేసిఆర్ మాటలు దీనిని రుజువు చేస్తున్నాయని కేంద్రంలో నామ మంత్రి అవుతారంటే బిజెపితో పొత్తు లేకుండా ఎలా సాధ్యమని పొంగులేటి ప్రశ్నించారు. సిపిఐ పార్లమెంటరీ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ మార్పు కోసం శాసనసభ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ కలిసి పనిచేసి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని అదే రీతిలో కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం మరోమారు కలిసి పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని కమ్యూనిస్టులు ఏమి కోరుకుంటున్నారో కాంగ్రెస్ అధికారం వస్తే అదే చేస్తుందని పొంగులేటి తెలిపారు.

దేశ భవితవ్యాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్న బిజెపి రామున్ని రాజకీయాల్లోకి తీసుకు వచ్చిందని మనకు అక్షింతలు ఇచ్చి అధికారాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తుందని పొంగులేటి తెలిపారు. బిజెపిని ఓడించక పోతే దేశానికి ప్రమాదమన్నారు. ఇక 2019లో సారు కారు పదహారు అంటూ కేసిఆర్ ప్రచారానికి తెలంగాణ ప్రజలు కర్రుకాచి వాతపెట్టారని ఇప్పుడు మరోసారి వాతలు తప్పవన్నారు. రూ.1.50 లక్షల కోట్లు దోచుకుని దాని నుంచి బయటపడేందుకు రాత్రిపూట చర్చలు జరుపుతున్నారని బిఆర్ఎస్ ను పొంగులేటి విమర్శించారు. అక్రమాలు బయటపడుతున్నాయని విద్యుత్ శాఖ, నీటిపారుదల, ధరణి ద్వారా దోచుకున్న సొమ్ము బయటపడక తప్పదన్నారు. తెలంగాణలో 17కు 17 స్థానాలు సెక్యూలర్ కూటమి గెలుస్తుందని బిఆర్ఎస్, బిజెపిలను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు.

ఉమ్యమ ఖిల్లాలో ఇండియా కూటమికి ఎదురు లేదని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల కంచుకోట అని ఆయన
ఉద్ఘాటించారు . జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ను బలపరుస్తున్నామని దేశం కోసం కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేశారని ఈ పొత్తు కూడా త్యాగం లాంటిదేనన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బిజెపిని ఓడించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కమ్యూనిస్టులకు మోసం, దగా తెలియదని కూనంనేని తెలిపారు. మోడీ ఏ ప్రధాన మంత్రి మాట్లాడని విధంగా నికృష్టంగా మాట్లాడుతున్నారని ఆయనకు రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. హిందువుల మధ్య కూడా ఘర్షణలు జరిగిన చర్రితలు ఉన్నాయి కానీ స్వాతంత్య్ర అనంతరం హిందు, ముస్లింల మధ్య ఘర్షణ జరగలేదని ఆయన తెలిపారు. బిజెపిలో భయం మొదలైందని అందుకే ముస్లింలపై, క్రిస్టియన్లపై దాడులకు తెగబడుతుందన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి రామసహయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ నేను పక్కా లోకల్ అని మా నాన్నది చేగొమ్మ గ్రామమని నేను ఖమ్మంలో నామ నాగేశ్వరరావు ఇంటి పక్కనే ఉంటానని మా అత్తగారిది పిండిప్రోలు అని ఆయన తెలిపారు. బిజెపికి ఓటు వేస్తే రూ. 65 పెట్రోలు రూ.110, రూ.400 గ్యాస్ రూ.1100లకు పెరిగిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేని బిజెపి ఇప్పుడు రాముని నినాదాన్ని అందుకుందన్నారు. సెక్యూలర్ శక్తులను బలపర్చి తనకు ఓటువేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈసమావేశంలో సిపిఐ ఖమ్మంజిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, రాష్ట్ర నాయకులు మహ్మద్ మౌలానా, దండి సురేష్, జమ్ముల జితేందర్రెడ్డి, యర్రా బాబు. ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు,సిద్ధినేని కర్ణకుమార్, ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, సలీం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ బహిరంగ సభలో బుల్లెట్ల కలకలం

Ram Narayana

ఎంపీ వద్దిరాజు ఆపరేషన్ సక్సెస్ …

Ram Narayana

నకిలీ విత్తనాల సరఫరా చేస్తే కఠిన చర్యలు …వ్యవసాయమంత్రి తుమ్మల

Ram Narayana

Leave a Comment