- గతేడాది సర్రీలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య
- ఈ కేసులో శుక్రవారం నిందితులను అరెస్టు చేసిన స్థానిక పోలీసులు
- కొన్ని నెలలుగా వారిపై నిఘా పెట్టి అనంతరం అదుపులోకి తీసుకున్న వైనం
- అరెస్టుపై కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కథనం
కెనడా పౌరుడు, సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా వారి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. రెండు ప్రావిన్సుల్లో ఒకేసారి రెయిడ్లు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కెనడా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఓ వార్తను ప్రస్తారం చేసింది. అయితే కెనడా పోలీసులు మాత్రం ఇంకా స్పందించలేదు.
గతేడాది జూన్ 18న సర్రీలోని ఓ గురుద్వారాలో ప్రార్ధన ముగించుకుని బయటకు వచ్చిన నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది.
తాజాగా టొరొంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమంలోనూ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నిజ్జర్ హత్య గురించి ప్రస్తావించారు. ఈ హత్య కెనడా అంతర్గత భద్రతకు ఓ సవాలని పేర్కొన్నారు. ఈ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని పునరుద్ఝాటించారు.
కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ‘‘ప్రధాని ట్రూడో గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కెనడాలో వేర్పాటువాదానికి, హింసకు, తీవ్రవాదానికి రాజకీయ ప్రాముఖ్యత ఉన్న విషయాన్ని ఆయన వ్యాఖ్యలు ఎత్తి చూపుతున్నాయి’’ అని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీప్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, భారత్‌లోని కెనడా డిప్యూటీ హైకమిషనర్‌కు పిలిపించుకుని కేంద్ర ప్రభుత్వం తన నిరసన వ్యక్తం చేశారు. ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఖలిస్థానీ దేశ ఏర్పాటును డిమాండ్ చేస్తున్న నిజ్జర్‌ను ఉగ్రవాదిగా గుర్తించిన భారత్.. అతడిని పలు టెర్రర్ కేసులకు సంబంధించి వాంటెడ్ లిస్టులో చేర్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు ఇండియన్లను అరెస్ట్ చేసిన కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు ఇండియన్లను అరెస్టు చేశారు. నిజ్జర్ హత్యకు సహకరించారనే ఆరోపణలతో శుక్రవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారంతా నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ గా నాలుగైదేళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని వివరించారు. నిందితులు కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28) ఫొటోలను మీడియాకు రిలీజ్ చేశారు.
కెనడా పౌరసత్వం పొందిన నిజ్జర్ 2023 జూన్ 18న సర్రేలోని ఓ గురుద్వారా ముందు హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కెనడా ప్రధాని ట్రూడోపై మండిపడింది. తగిన ఆధారాలు అందజేస్తే విచారణకు సహకరిస్తామని వెల్లడించింది. తాజాగా ఈ కేసులో ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.