- గుజరాత్ రాష్ట్రం వడాలిలో ఘటన
- తన మాజీ ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో నిందితుడు జయంతిభాయ్ దురాగతం
- టేప్ రికార్డర్ వంటి పరికరంలో బాంబ్ అమర్చి ప్రియురాలికి ఇంటికి పార్శిల్ పంపిన వైనం
- అది పేలి ఆమె భర్త జీతూభాయ్, కుమార్తె భూమిక మృతి
గుజరాత్ రాష్ట్రం వడాలిలో దారుణం జరిగింది. వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు జయంతిభాయ్ బాలుసింగ్ వంజర బాంబు పార్శిల్ పంపాడు. అది పేలి ఆమె భర్త జీతూభాయ్ హీరాభాయ్ వంజరతో పాటు ఓ కుమార్తె భూమిక చనిపోగా.. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో జీతూభాయ్ పటేల్ భార్య ఇంట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన ప్రియురాలిని జీతూభాయ్ పెళ్లి చేసుకోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు జయంతిభాయ్ పోలీసుల విచారణలో తెలిపాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయంతిభాయ్ (31) ఆటో రిక్షాలో జీతూభాయ్ ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరంలో బాంబ్ అమర్చి పార్శిల్ పంపాడు. జీతూభాయ్ దానిని గురువారం మధ్యాహ్నం ప్లగ్ ఇన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ బాక్స్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో జీతూభాయ్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతని కుమార్తె భూమిక (12) ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. జీతూభాయ్ మరో ఇద్దరు కుమార్తెలు కూడా పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇంటికి పార్శిల్ డెలివరీ చేసిన ఆటో రిక్షా డ్రైవర్‌ను గుర్తించామని సీనియర్ పోలీసు అధికారి విజయ్ పటేల్ తెలిపారు. ఆటో డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా పేలుడు జరిగిన కొన్ని గంటలలోపే నిందితుడు జయంతిభాయ్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
జీతూభాయ్ తన మాజీ ప్రియురాలిని పెళ్లి చేసుకోవడంతోనే అతడిని మట్టుబెట్టేందుకు అతని ఇంటికి బాంబు పార్శిల్ పంపించినట్లు జయంతిభాయ్ అంగీకరించాడు. ఇక ఈ ఇంప్రూవైజ్డ్ బాంబ్ తయారు చేయడానికి కావల్సిన మెటీరియల్స్ కోసం అతడు రాజస్థాన్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాంబు తయారీలో అతను జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్‌ను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. దాన్ని ఓ టేప్ రికార్డర్ వంటి పరికరంలో అమర్చాడు. అలాగే ఆ టేప్ రికార్డర్‌ను ప్లగ్ చేసిన వెంటనే పేలిపోయేలా సెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక పేలుడు సంభవించిన సమయంలో జీతూభాయ్ భార్య ఇంట్లో లేకపోవడం పలు అనుమానాలు కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. ఆమెను విచారిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.