అల్ ఖైదా అధిపతి జవహరి ఇంకా సజీవంగానే ఉన్నాడు: ఐరాస
-బిన్ లాడెన్ హతమైన తర్వాత పగ్గాలు చేపట్టిన జవహరి
-జవహరి హతమైనట్టు పలుమార్లు వార్తలు
-నిజం కాదని కొట్టేసిన ఐరాస నివేదిక
-ఆఫ్ఘనిస్తాన్-పాక్ సరిహద్దులో తలదాచుకున్నాడన్న ఐరాస
అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత ఉగ్రవాద సంస్థ పగ్గాలు చేపట్టిన అయమన్ అల్ జవహరి మరణించినట్టు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, అతడు బతికే ఉన్నాడని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో పేర్కొంది. అనారోగ్యం కారణంగా అతడు సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని తెలిపింది. జవహరి సహా అల్ ఖైదా కీలక నేతలంతా ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో స్థావరాలు ఏర్పాటు చేసుకుని తలదాచుకున్నారని నివేదిక పేర్కొంది.
వీరిందరికీ తాలిబన్ల నుంచి పూర్తి సహకారం అందుతోందని వివరించింది. భారత ఉపఖండంలో పనిచేస్తున్న అల్ ఖైదా ఉగ్రవాదుల గురించి కూడా ఐరాస నివేదిక ప్రస్తావించింది. వీరంతా కాందహార్, హెల్మండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్న నివేదిక.. వీరిలో అత్యధికులు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులేనని వివరించింది. దీనిపై అమెరికా అనేక సార్లు అల్ ఖైదా అధిపతి జహరి మరణించాడని ప్రకటించిన నేపథ్యంలో జహరితో పాటు అనేకమంది నేతలు పాకిస్తాన్ -ఆఫ్గనిస్తాన్ బోర్డర్ లో తలదాచుకున్నారన్న నివేదిక పై ఆరా తీస్తున్నారు.