Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీలో అవినీతిపరులకు పక్కా ట్రీట్ మెంట్ ఇస్తాం: ప్రధాని మోదీ

కౌంట్ డౌన్ మొదలైంది… ఏపీలో అవినీతిపరులకు పక్కా ట్రీట్ మెంట్ ఇస్తాం: ప్రధాని మోదీ

  • పీలేరు నియోజకవర్గం కలికిరిలో కూటమి సభ
  • హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
  • డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటన
  • ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన కూటమి సభకు హాజరయ్యారు. నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో  ప్రసంగం ప్రారంభించారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి భక్తిప్రపత్తులతో ప్రణమిల్లుతున్నానని తెలిపారు. వాగ్గేయకారుడు అన్నమయ్యను ప్రస్తావిస్తూ తన ప్రసంగం కొనసాగించారు. మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ వికాసం అంటూ తెలుగులో నినదించారు. 

“అనేక రకాల ఖనిజాలు కలిగి ఉన్న నేల రాయలసీమ. ఇక్కడ గనులు ఉన్నాయి. భవ్యమైన, దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు, ప్రతిభావంతులైన యువత ఉంది. పర్యాటకానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఇక్కడ అనేక సమస్యలు కూడా ఉన్నాయి… ఆ సమస్యలకు హద్దే లేదు. 

ఇప్పుడు నేను ఇక్కడికి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. రాయలసీమను సర్వతోముఖాభివృద్ధి చేయడం నా లక్ష్యం. రాయలసీమ… రాష్ట్రానికి అనేకమంది ముఖ్యమంత్రులను ఇచ్చింది. కానీ ఇక్కడి ప్రజలకు ఏం లభించింది? ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు, సాగునీరు లేదు, పరిశ్రమలు లేవు, ఇక్కడి రైతులు ఆందోళనలో ఉన్నారు, ఉద్యోగ ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి? ఏపీలో కూడా ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకురావాలి. 

ఏపీలో ప్రజలు అనేక ఆకాంక్షలతో వైసీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజల నమ్మకాలను వమ్ము చేసింది. విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. పేదలను అభివృద్ధిలోకి తీసుకురాకుండా, మాఫియాను అభివృద్ధి చేసింది. వైసీపీ మంత్రులు గూండాయిజం చేస్తున్నారు, ఇక్కడొక రౌడీరాజ్యం నిర్మించడం మీరందరూ చూస్తున్నారు. 

ఇక్కడ ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. దాదాపు 30 గ్రామాలు కొట్టుకుపోగా, 12 మంది మరణించారు. ఈ ఘటనతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇలాంటి మాఫియాలకు స్థానిక ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోంది. ఈ సభ నుంచి మాఫియాకు చెబుతున్నా… మీ కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ ప్రతి మాఫియాకు తగిన రీతిలో చికిత్స చేస్తుంది. అవినీతికి పాల్పడిన ఒక్కొక్కరికి తగిన ట్రీట్ మెంట్ ఇవ్వడం ఖాయం. 

ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నది మా సంకల్పం. కానీ ఇక్కడి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కు సహకరించడంలేదు. పోలవరం ప్రాజెక్టు పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో మనం చూస్తున్నాం. రాయలసీమకు సాగునీటి సౌకర్యం కల్పించడంలేదు. ఎన్డీయే సర్కారు వస్తే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాం. దృఢమైన ప్రభుత్వం ఉంటే దృఢమైన దేశం ఏర్పడుతుంది. ఇవాళ భారత్ శక్తిమంతంగా ఉందా, లేదా? 

ఇక్కడ్నించి అనేకమంది ప్రజలు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మనవారికి గల్ఫ్ దేశాల్లో గౌరవం పెరిగిందా, లేదా? విదేశాల్లో ఉన్న మన పౌరులకు ఎలాంటి కష్టం వచ్చినా, మేం వెంటనే పరిష్కరిస్తున్నాం. ఈ మధ్య ఖతార్ లో చిక్కుకున్న మన సోదరులను కాపాడగలిగాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? కానీ మేం ఖతార్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగాం. ఇది ఎలా సాధ్యమైందంటే… ఎన్డీయే ఒక శక్తిమంతమైన ప్రభుత్వాన్ని తయారుచేసింది కాబట్టి. అందుకే మీ ఓటు ఎన్డీయే కూటమికే వేయండి. 

దేశాన్ని ముక్కలు  చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దేశ మూలాలను నాశనం చేయాలన్నది ఆ పార్టీ లక్ష్యం. భారతదేశం ఒక జాతి కాదు, విభిన్న జాతుల సమూహం అనేది ఆ పార్టీ సిద్ధాంతం. దేశ విభజనకు కారణమైన పార్టీ కాంగ్రెస్. ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు అని విభజించి మాట్లాడుతున్నారు. 

దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి ఎన్డీయే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశంలో అనేక రకాలుగా ఎక్స్ ప్రెస్ హైవే లేన్లు నిర్మాణం అవుతున్నాయి. నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైనుకు ఆమోదం లభించింది. కడప ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు కూడా బుల్లెట్ రైలు రావాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. 

రాయలసీమలో రైతుల జీవితాన్ని మార్చగలిగేది ఎన్డీయే ప్రభుత్వమే. రాబోయే ఐదేళ్లలో ఇక్కడ టమాటా, ఇతర కూరగాయల పంటల కోసం కోల్డ్ స్టోరేజి క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు వల్ల రైతులకు, యువతకు లబ్ధి చేకూరుతుంది. 

ఎన్డీయే కూటమి తరఫున ఏపీలో పోటీ చేస్తున్న అందరు అభ్యర్థులకు ప్రజలు ఓటేసి గెలిపించాలి. రాజంపేట లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఉన్న నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డికి, చిత్తూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి ప్రసాదరావుకు, తిరుపతి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ కు, కడప లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి మీరంతా ఓటేసి వారిని ఎంపీలుగా గెలిపించి ఢిల్లీకి పంపండి” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Related posts

ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. 24 మంది మంత్రుల జాబితా విడుదల…

Ram Narayana

షర్మిలతోనే తన ప్రయాణమన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి…వైసీపీలో కలవరం …

Ram Narayana

దూకుడు పెంచిన వైసీపీ …27 మంది ఇంచార్జి లతో రెండవ జాబితా …!

Ram Narayana

Leave a Comment