Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

విద్యుత్ శాఖలో కావాలనే పవర్ కట్ చేస్తున్నారు…రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ…

హరీశ్ రావు కొందరితో ఇలాంటి తలతిక్క పనులు చేయిస్తున్నారు

  • తెలంగాణలో బీజేపీ వేవ్ లేదన్న రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ 9 నుంచి 13 సీట్లు గెలుస్తుందన్న ముఖ్యమంత్రి
  • కాంగ్రెస్, బీజేపీలలోకి ఎమ్మెల్యేలు వెళితే బీఆర్ఎస్ ఉండదన్న రేవంత్ రెడ్డి
  • ఫోన్ ట్యాపింగ్ కేసుపై అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టీకరణ
  • రైతు రుణమాఫీకి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి
  • త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ

విద్యుత్ శాఖలో కొందరు కావాలనే పవర్ కట్ చేస్తున్నారని… అందుకే కొన్నిచోట్ల విద్యుత్ కోతలొస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కొందరితో ఇలాంటి తలతిక్క పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… తెలంగాణలో బీజేపీ వేవ్ ఏమీ లేదని… తాము 9 నుంచి 13 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరేడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని… ఆత్మహత్యలే ఉంటాయని… అందుకు బీఆర్ఎస్ నిదర్శనమన్నారు. తమకు బీజేపీతో మాత్రమే పోటీ అన్నారు. జాతీయస్థాయిలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు.

మెదక్ లోక్ సభ స్థానంలో బీజేపీ మూడో స్థానానికి పడిపోతుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో గతంలో కంటే మెరుగైన పోలింగ్ నమోదయిందన్నారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 20వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా బీజేపీ కోసం పని చేశాయని ఆరోపించారు. రానున్న పదేళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలలోకి ఎమ్మెల్యేలు వెళితే బీఆర్ఎస్ పార్టీ ఉండదన్నారు. ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తామన్నారు.

రిటైర్డ్ ఉద్యోగులపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర రావు ఎవరో తనకు తెలియదని కేసీఆర్ అంటున్నారని… కానీ ఈ కేసులో ఆయన ఉన్నట్లు కూడా తనకు తెలియదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడించారు. రేసింగ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై విచారణ జరుగుతోందన్నారు. ఆకస్మిక తనిఖీలు, పర్యటనలు ఉంటాయని తెలిపారు. మూసీ నదిని ఆదాయవనరుగా మారుస్తామన్నారు.

రైతు రుణమాఫీకి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం

త్వరలో బ్యాంకర్లతో సమావేశమవుతామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై చర్యలు చేపడతామన్నారు. రైతుల రుణాల మాఫీ కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఎన్నికలు ముగియగానే రేపటి నుంచి పాలనపై దృష్టి సారిస్తామన్నారు. హామీల అమలుపై సమీక్ష చేస్తామన్నారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, విద్యా శాఖపై దృష్టి పెడతామన్నారు. ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేస్తున్నామన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు.

Related posts

యతి ప్రాసలతో కాంగ్రెస్ ను ఉతికి పారేసిన మంత్రి హరీష్ రావు …

Ram Narayana

ఎన్నికల్లో మద్దతు కోరిన కిషన్ రెడ్డి.. చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న పవన్ కల్యాణ్

Ram Narayana

రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన

Ram Narayana

Leave a Comment