- తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో కొన్ని రోజులుగా వర్షాలు
- కళ్లెదుటే ఉద్ధృతమైన నీటి ప్రవాహం
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన పర్యాటకులు
తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం… కుర్తాళం. ఇక్కడి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఎప్పట్లాగానే పర్యాటకులు పాత కుర్తాళం జలపాతం వద్దకు రాగా, కొన్ని సెకన్ల వ్యవధిలోనే మెరుపు వరదలు సంభవించాయి. చూస్తుండగానే నీటి ప్రవాహం ఉద్ధృతమైంది. దాంతో పర్యాటకులు హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కాగా, కుర్తాళం జలపాతం భయానక రూపుదాల్చిన నేపథ్యంలో, అశ్విన్ అనే ఓ 17 ఏళ్ల కుర్రాడు గల్లంతయ్యాడు. 11వ తరగతి చదువుతున్న ఆ బాలుడు పాలయంకొట్టై ప్రాంతంలోని ఎన్జీవో కాలనీకి చెందినవాడిగా గుర్తించారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి కుర్తాళం జలపాతం వద్దకు చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అశ్విన్ మృతదేహం జలపాతం నుంచి అరకిలోమీటరు దూరంలో కొండరాళ్ల మధ్య చిక్కుకుని కనిపించింది.