- 2024 ఎన్నికల తర్వాత అమిత్ షా ప్రధాని కావడం ఖాయమన్న కేజ్రీవాల్
- బీజేపీ మరోసారి గెలిస్తే యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను పదవి నుంచి తొలగిస్తారన్న ఢిల్లీ సీఎం
- కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్
- కేజ్రీవాల్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శ
ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల మీద కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. యూపీలోని రాజాజీపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ… మోదీ పదవీ విరమణ చేయనున్నారని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పదవి నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారని… ఇవి అర్థరహితమైనవి అన్నారు. 2024 ఎన్నికల తర్వాత మోదీ ప్రధాని పదవిలో ఉండరని కేజ్రీవాల్ చెబుతున్నారని, ఆయన మాటలు విని ఆశ్చర్యపోయానన్నారు.
కేజ్రీవాల్ ఇప్పుడే మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారని గుర్తు చేశారు. జూన్ 1 తర్వాత తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉందన్నారు. భారత ప్రధాని గురించి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడటం సరికాదన్నారు. కేవలం 2024లోనే కాదని… 2029లో కూడా దేశం మొత్తం మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటోందన్నారు.
యోగి ఆదిత్యనాథ్‌పై కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారని, బలమైన, సమర్థమైన నాయకత్వం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అబద్ధాలతో రాజకీయం చేయలేమని ఆయనకు తాను హితవు పలకాలనుకుంటున్నానని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం చిక్కుల్లో పడుతుందన్న విపక్షాల ఆరోపణలను రాజ్‌నాథ్ సింగ్ కొట్టి పారేశారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఎదురైంది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు.
కాగా, గురువారం కేజ్రీవాల్ మాట్లాడుతూ… 2025లో 75 ఏళ్లు నిండిన అనంతరం ప్రధాని మోదీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని వ్యాఖ్యానించారు. అమిత్ షా తదుపరి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పుడు అమిత్ షా కోసమే మోదీ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రెండు నెలల్లో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ పైవిధంగా స్పందించారు.