- ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో వెలుగు చూసిన ఘటన
- దుండగులు సిగ్నల్‌కు బురద పూయడంతో నిలిచిపోయిన పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ – చండీగఢ్ రైళ్లు
- ప్రయాణికుల నుంచి వస్తువులు, నగదు చోరీకి యత్నం
- ప్రయాణికులు ఎదురుతిరగడంతో పరార్
- ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు
ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో దోపిడీ దొంగలు అసాధారణ రీతిలో చోరీకి యత్నించారు. సిగ్నల్‌కు బురద పూసి రైళ్లలో దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. ప్రయాణికులు ఎదురుతిరగడంతో గత్యంతరం లేక పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోరాదాబాద్ – సహారన్‌పూర్ రైల్వే డివిజన్ లక్సర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రైలు సిగ్నల్‌కు కొందరు దుండగులు బురద పూశారు. సిగ్నల్ కనిపించకపోవడంతో పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ – చండీగఢ్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.
అనంతరం, ప్రయాణికుల వస్తువులు, నగదును దోపిడీ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ప్రయాణికులు ఎదురు తిరగడంతో పరారయ్యారు. ఈలోపు లోకో పైలట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. లక్సర్ ఆర్పీఎఫ్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ రవి శివాచ్, జీఆర్పీ పోలీస్ స్టేషన్ హెడ్ సంజయ్ శర్మ, జీఆర్పీ ఎస్పీ సరితా డోభాల్ ఘటన స్థలానికి చేరుకుని దోపిడీ యత్నం తీరుతెన్నులను పరిశీలించారు. విచారణకు ఆదేశించారు.