- ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ నియోజకవర్గంలో వెలుగు చూసిన ఘటన
- ఓటేస్తున్నప్పుడు వీడియో రికార్డు చేసిన యువకుడు
- వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాల గగ్గోలు
- పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేసిన ఈసీ
నిబంధనలను అతిక్రమిస్తూ బీజేపీకి ఏకంగా 8 మార్లు ఓటేసిన ఉత్తరప్రదేశ్ యువకుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఓ పోలింగ్ బూత్‌లో అతడు పలుమార్లు బీజేపీకి ఓటు వేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో కలకలం రేగింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. అతడిని రంజన్ సింగ్‌గా గుర్తించారు.
నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రంజన్ సింగ్.. బీజేపీ అభ్యర్థి ముఖేశ్ రాజ్‌పుత్‌కి ఎనిమిది సార్లు ఓటేయడం కనిపిస్తోంది. యూపీలోని ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాజ్‌పుత్ బరిలో నిలిచారు.
కాగా, నయాగావ్ పోలీస్ స్టేషన్ లో రంజన్‌పై కేసు నమోదైంది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఘటన జరిగిన పోలింగ్ బూత్ లో విధులు నిర్వర్తిస్తున్న వారందరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.