Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఇది వరకు బ్రూకాఫీ ఉండేది… ఇప్పుడు ‘బ్రూ’ ట్యాక్స్ వచ్చింది: కేటీఆర్

ఇదివరకు కేఏ పాల్‌పై జోకులు వేసేవారు.. ఇక కోమటిరెడ్డిపై వేసే పరిస్థితి వస్తుంది!

  • బ్రూ ట్యాక్స్ అంటే.. భట్టి, రేవంత్, ఉత్తమ్ అన్న కేటీఆర్
  • రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారని విమర్శ
  • కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులను యథేచ్ఛగా ఉల్లంఘించారన్న కేటీఆర్
  • తాము మాత్రం అటెండర్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1 వరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు తెచ్చామన్న కేటీఆర్

ఇదివరకు బ్రూ కాఫీ ఉండేదని… ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… బ్రూ (BRU) ట్యాక్స్ అంటే.. భట్టి, రేవంత్, ఉత్తమ్ అని ఆరోపించారు. ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది కాబట్టి ఇక ఎవరి దుకాణం వారే తెరుస్తారని విమర్శించారు. రక్తం రుచిమరిగిన పులులు అని ధ్వజమెత్తారు. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారన్నారు.

ఇలాంటి పనులతో నిర్మాణ రంగం కుదేలవుతుందని… పరిశ్రమలు వెళ్లిపోతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేదని… అందుకే బ్రూ ట్యాక్స్ తెచ్చారన్నారు. మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇలా చేస్తుండవచ్చు… కానీ ఇలా ఉంటే కొత్త పరిశ్రమలు తేవడం మాట పక్కన పెడితే ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందన్నారు.

కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అబద్ధపు ప్రచారం

కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో 2.32 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ఈ ఐదు నెలల్లో కేసీఆర్ ఇచ్చిన వారికే ఉద్యోగాలు ఇచ్చింది తప్ప కొత్తగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. పైగా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామన్నారు. తాము 30వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఆ ఉద్యోగాలు మీరే ఇస్తే కనుక నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు?    పరీక్షలు ఎప్పుడు పూర్తయ్యాయి? అపాయింటుమెంట్ లెటర్ ఎప్పుడు ఇచ్చారు? చెప్పాలన్నారు. సీఎం స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. గత పదేళ్లలో తెలంగాణ కంటే దేశంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు. అలా నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని… లేదంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 2.37 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలుసుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు. నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని స్థానిక కోటా 95 శాతం తాము అమలు చేశామన్నారు. అటెండర్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1 వరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు తెచ్చామన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 26 వేలే అన్నారు. అందులోనూ తెలంగాణ యువతకు వచ్చింది 10 వేల ఉద్యోగాలే అన్నారు. కానీ తమ హయాంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.

 ఇదివరకు కేఏ పాల్‌పై జోకులు వేసేవారు.. ఇక కోమటిరెడ్డిపై వేసే పరిస్థితి వస్తుంది!: కేటీఆర్

ఇదివరకు కేఏ పాల్‌పై అందరూ జోకులు వేసేవారని… త్వరలో కోమటిరెడ్డిపై జోకులు వేసే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. టిమ్స్ ఆసుపత్రిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒక మంత్రి హోదాలో ఉండి ‘కరెంట్ పోతుంద’ని ఎలా మాట్లాడుతారని మండిపడ్డారు. ఆయన మంత్రా? లేక జోకరా? అని ఎద్దేవా చేశారు. మూర్ఖులే అలా మాట్లాడుతారన్నారు.

కరెంట్ పోతే 14వ అంతస్తు నుంచి 27వ అంతస్తుకు ఎలా పోతారు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారని… మరి 14 అంతస్తులే కడితే… 3వ అంతస్తులో ఉన్నప్పుడు కరెంట్ పోతే 14వ అంతస్తుకు ఎలా వెళతారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు మంత్రి నోటి నుంచి కరెంట్ పోతుందనే మాట ఎందుకు వస్తుందో చెప్పాలన్నారు. తాము ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రాలేదన్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత మూర్ఖులు, ఎంత సన్నాసులు, ఎంత జోకర్లు నడుపుతున్నారో తెలుస్తోందన్నారు. కరెంట్ పోతే జనరేటర్ ఉండదా? అని చురక అంటించారు. ఆయన మంత్రా… నాకు అర్థం కావడం లేదు… పైగా ఆయన వేసిన ప్రశ్నకు మీరు (జర్నలిస్టులు) నన్ను అడగడమేమిటన్నారు.

Related posts

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ.. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన కిషన్ రెడ్డి

Ram Narayana

బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకుంటే అంతే సంగతులు: రేవంత్ రెడ్డి

Ram Narayana

ఎందుకు కలిశామంటే..?: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ

Ram Narayana

Leave a Comment