- కేంద్రంలో బీజేపీదే మళ్లీ అధికారమన్న పీకే, ఐయాన్ బ్రెమర్
- తాజాగా అదే విషయం చెప్పిన యోగేంద్ర యాదవ్
- బీజేపీకి 240 నుంచి 260 స్థానాలు వస్తాయని అంచనా
- కాంగ్రెస్ 100 సీట్లు దాటేస్తుందన్న యోగేంద్ర
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిశోర్, అమెరికా పోల్ ఎక్స్‌పర్ట్ ఐయాన్ బ్రెమెర్ ఇప్పటికే జోస్యం చెప్పేశారు. రాజకీయ నాయకుడిగా మారిన సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరారు. బీజేపీ మరోమారు అధికారంలోకి రాబోతోందని తేల్చేశారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 100కుపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని యోగేంద్ర అంచనా వేశారు.
బీజేపీకి 240 నుంచి 260 సీట్లు వస్తాయని, దాని మిత్ర పక్షాలు 35 నుంచి 45 సీట్లు గెలుచుకుంటాయని చెప్పారు. దీనిని బట్టి ఎన్డీయే కూటమికి మొత్తం 275 నుంచి 305 సీట్ల వరకు వస్తాయని, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా అని స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ 85 నుంచి 100 స్థానాలతో సరిపెట్టుకుంటుందని చెప్పారు. యోగేంద్ర చెబుతున్న దానినిబట్టి ఈసారి బీజేపీ గణనీయ సంఖ్యలో స్థానాలను కోల్పోనుంది. అంటే 120 నుంచి 135 స్థానాలు తగ్గే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ 52 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అంటే ఈసారి వాటికి రెండింతల సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంటుందన్నమాటే. ఈసారి తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, తెలంగాణలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఐయాన్ బ్రెమెర్ అంచనా వేశారు.