Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే …

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రభుత్వం సూత్ర­ప్రాయంగా నిర్ణయించింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కన్వీనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే..

రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్‌లోని గాందీ, ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్‌ కాలేజీలు, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్‌ కాలేజీల్లోనే ఎన్‌ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్‌ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు.

కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్‌ కాలేజీల్లోని కనీ్వనర్‌ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్‌ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ కంటే ముందే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

జనరల్‌ కోటా సీట్లకు గండి

రాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్‌ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్‌ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్‌ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు.

కానీ తాజాగా ఎన్‌ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్‌ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్‌ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.8 లక్షల ఆదాయ పరిమితి

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Related posts

లడఖ్ లో ఘోర ప్రమాదం… 9 మంది ఆర్మీ జవాన్ల దుర్మరణం

Ram Narayana

మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా: చేనేత వస్త్రాలు చూసి ముచ్చటపడిన రాష్ట్రపతి

Ram Narayana

మన్మోహన్ మృతి: బ్యాంకులు, స్కూళ్లకు సెలవా? కాదా?.. ఇంటర్నెట్‌లో తెగ వెతుకులాట!

Ram Narayana

Leave a Comment