Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని ఎవరన్న దానికి ఖర్గే సమాధానం …

  • కౌన్ బనేగా కరోడ్ పతి అంటూ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్య
  • కూటమిలోని పార్టీల ప్రతినిధులంతా కూర్చొని డిసైడ్ చేస్తామని వెల్లడి
  • 2004లో కాంగ్రెస్ నేతలంతా సోనియా ప్రధాని కావాలన్నారు.. కానీ మన్మోహన్ సింగ్ ప్రధాని సీట్లో కూర్చున్నారని గుర్తుచేసిన ఖర్గే

కేంద్రంలో విపక్షాల కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందనే విషయంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈమేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమికి మెజారిటీ వస్తే ప్రధానిగా ఎవరు ఉండాలనేది నేతలంతా కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ప్రధాని ఎవరనేది ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లాంటి ప్రశ్న అని ఖర్గే చెప్పారు. ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అందరికీ నచ్చిన వ్యక్తిని ప్రధానిని చేస్తామని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి అనుకున్నది జరగకపోవచ్చని తెలిపారు. ఇందుకు ఉదాహరణగా 2004 నాటి పరిస్థితిని ఖర్గే గుర్తు చేశారు.

అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) కూటమికి మెజారిటీ వచ్చినా, కూటమిలోని పార్టీల నేతలంతా సోనియా గాంధీని ప్రధానిని చేద్దామని అనుకున్నా అది జరగలేదని చెప్పారు. నేతలంతా కోరినా కూడా ప్రధాని పదవి చేపట్టేందుకు సోనియా గాంధీ నిరాకరించారని తెలిపారు. అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ప్రధాని పదవి చేపట్టి, పదేళ్ల పాటు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపించారని గుర్తుచేశారు. ఇండియా కూటమి తరఫున ప్రధాని పదవి ఎవరు చేపడతారనేది ఇప్పుడే చెప్పలేమని ఖర్గే పరోక్షంగా పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ.. కొన్నికొన్నిసార్లు తెలివైన వాళ్లు కూడా చరిత్రను మరిచిపోతారని చెప్పారు.

2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ద్రవ్యోల్బణం నియంత్రిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేస్తూ.. పదేళ్ల పాలన తర్వాత చూస్తే ఆ రెండు హామీలు అమలు చేసిన దాఖలాలు కనిపించవని చెప్పారు. అయినా ఈ విషయం చాలామంది గుర్తించడంలేదని అన్నారు. ప్రకృతి విలయంతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైనప్పుడు ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆరోపించారు. అయితే, హిమాచల్ ప్రభుత్వంలో కాస్త ఒడిదుడుకులు ఏర్పడగానే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ వెంటనే అప్రమత్తమై అధికారం చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Related posts

ఏపీలో చంద్రబాబు ..కేంద్రంలో మోడీ బల్లగుద్ది చెపుతున్న ప్రశాంత్ కిషోర్…

Ram Narayana

వారణాసిలో మోడీతో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్…!

Ram Narayana

ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

Leave a Comment