ఆయన పాత్రే కీలకం:
- ట్యాపింగ్‌పై కేంద్రం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
- ఈ అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని వ్యాఖ్య
- బీఆర్ఎస్ అని పేరు మార్చడమే కేసీఆర్ పట్ల భస్మాసుర హస్తంగా మారిందన్న జీవన్ రెడ్డి
- కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ఇది కూడా కారణమైందని వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిగితే కేసీఆర్ ఇరుక్కోవడం ఖాయమని… ఇందులో ఆయన పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ… ట్యాపింగ్ విషయంపై కేంద్రం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మేడిపల్లి సత్యం, జువ్వాడి నర్సింగరావు, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అని పేరు మార్చడమే కేసీఆర్ పట్ల భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ఇది కూడా కారణమైందన్నారు.
ప్రధాని మోదీ మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు మార్పు చేయడంతో పాటు వెనుకబడిన అన్ని వర్గాలకు… మతాలకు, అతీతంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర గీతం నిర్మాణంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి ఉండటాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఆంధ్రా సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.