- పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో దోషిగా తేలిన ట్రంప్
- 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధారించిన మన్‌హట్టన్ కోర్టు
- తండ్రితో ఉన్న చిన్ననాటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఇవాంక
- ఆ ఫొటోకు ‘లవ్ యూ డాడ్’ అంటూ హార్ట్ ఎమోజీతో కూడిన క్యాప్షన్
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో అక్రమ సంబంధం ఉదంతంలో హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలిన విషయం తెలిసిందే. స్టార్మీ డేనియల్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో మన్‌హట్టన్ కోర్టు జ్యూరీ ఆయనను దోషిగా తేల్చింది. 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధారించింది. మాజీ అటార్నీ మైఖేల్ కోహెన్ ద్వారా ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు చెల్లించారు.
అయితే, ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ తన వ్యాపార ఖాతాలను తారుమారు చేశారు. ఈ కేసులో కొన్ని రోజుల నుంచి కోర్టులో విచారణ జరిగింది. చివరికి న్యాయస్థానం మాజీ అధ్యక్షుడిని దోషిగా తేల్చింది. దోషిగా తేలిన ట్రంప్‌కు జులై 11వ తేదీన మన్‌హట్టన్ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.
ఇక తన తండ్రి దోషిగా తేలడంతో కుమార్తె ఇవాంక ట్రంప్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ మేరకు తన తండ్రితో ఉన్న చిన్ననాటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ ఫొటోకు ‘లవ్ యూ డాడ్’ అంటూ హార్ట్ ఎమోజీతో కూడిన క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇవాంక వైట్‌హౌస్‌లో ఆయనకు అడ్వైజర్‌గా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో ఆమె తన తండ్రి వ్యవహారాలపై ఎక్కడా మాట్లాడలేదు. సోషల్ మీడియా వేదికల్లో కూడా గత కొంతకాలంగా ఆమె చేస్తున్న పోస్టుల్లో ఎక్కువగా ఫ్యామిలీ హలీడే వెకేషన్స్ ఫొటోలు, సెల్ఫీలు, హాలీడే సందేశాలు మాత్రమే కనిపించాయి.
దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్పందన ఇదీ..!
శుక్రవారం మన్‌హట్టన్ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ తప్పుపట్టారు. జ్యూరీ తీసుకున్న నిర్ణయం అవమానకరమని, నిజమైన తీర్పు నవంబర్ 5వ తేదీన జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో తెలుస్తుందని ట్రంప్ అన్నారు. ఇక ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.