Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంక్రికెట్ వార్తలు

ఇండియా-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌లో హైడ్రామా సీన్.. మైదానంలోకి పోలీసుల ఎంట్రీ…

  • భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని
  • హిట్‌మ్యాన్‌ను కౌగిలించుకున్న ఫ్యాన్.. మైదానంలోకి దూసుకొచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అభిమాని పట్ల కఠినంగా వ్యవహరించొద్దని సూచించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా శనివారం భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన సన్నాహక మ్యాచ్‌లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. భద్రతా ఉల్లంఘన ఘటన నమోదయింది. భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అభిమాని ఒకరు మైదానంలోకి పరుగెత్తుకొని వచ్చాడు. అమాంతం వచ్చి తన అభిమాన క్రికెటర్‌ హిట్‌మ్యాన్‌ను హత్తుకున్నాడు. కానీ ఈ సీన్‌ను చూసిన అక్కడి భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. రెప్పపాటులోనే ఇద్దరు పోలీసు అధికారులు మైదానంలోకి పరిగెత్తుకెళ్లారు. రోహిత్‌ దగ్గరకు వచ్చిన అభిమానిని తమదైన స్టైల్లో కిందపడేసి.. నేలకు అదిమిపట్టి అదుపులోకి తీసుకున్నాడు. అయితే ఈ దృశ్యాన్ని దగ్గర నుంచి చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త కంగారుపడ్డాడు. అభిమాని విషయంలో కఠినంగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ 60 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా అజేయ 40 పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 60 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు. ఇక ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా బౌలింగ్‌లో మెరిశాడు. 2 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇతర బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడడానికి ముందు సాధించిన ఈ విజయం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపనుంది.

Related posts

ఇమ్రాన్ ఖాన్ కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల పాటు అనర్హత వేటు

Ram Narayana

భారత మూలాలు నాకెంతో గర్వకారణం: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

Ram Narayana

హిందువులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కెనడా ప్రధాని

Ram Narayana

Leave a Comment