- కొత్త కలలు కనాలి.. వాటితో జీవిస్తూ నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలన్న మోదీ
- యువతే భారతదేశానికి గొప్ప బలమని పేర్కొన్న ప్రధాని
- వచ్చే 25 సంవత్సరాలు దేశాన్ని కొత్త తీరంవైపు నడిపించాలని వెల్లడి
- సాగరాల సంగమమే కాదు కన్యాకుమారి సైద్ధాంతిక సంగమం కూడా అని వ్యాఖ్య
‘కొత్త కలలు కనాలి.. వాటితో జీవిస్తూ నిజం చేసుకోవడానికి శ్రమించాలి’ అంటూ దేశ యవతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడి స్ఫూర్తిగా వచ్చే 25 సంవత్సరాలు భారత దేశాన్ని కొత్త తీరాల వైపు నడిపించాలని, అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. భారత దేశానికి యువతే గొప్ప బలమని పేర్కొన్న ప్రధాని.. కాలం చెల్లిన ఆలోచనలకు స్వస్తి పలకాలని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తోందని, మన అభివృద్ధి ప్రపంచానికీ మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈమేరకు కన్యాకుమారిలో 45 గంటల ధ్యానం తర్వాత శనివారం ఢిల్లీకి బయలుదేరిన మోదీ.. విమానంలో తన ఆలోచనలకు రూపమిస్తూ ఓ వ్యాసం రాశారు. ధ్యానం ప్రారంభించిన తర్వాత తనకు కలిగిన అనుభూతులను, కన్యాకుమారి గురించి, దేశం గురించి తన ఆలోచనలను ఈ వ్యాసంలో పొందుపరిచారు. అందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
బాహ్య ప్రపంచం నుంచి వేరుపడి..
ధ్యానం ప్రారంభించిన తొలి క్షణాలలో నా మదిలో ఎవేవో ఆలోచనలు.. ఎన్నికల ప్రచారం, రాజకీయ వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వంటి ఏవేవో ఆలోచనలు కదలాడాయి. కాసేపటి తర్వాత అవన్నీ మాయమయ్యాయి. బాహ్య ప్రపంచం నుంచి నా మది పూర్తిగా వేరు పడింది. బాధ్యతల బరువును తొలగించుకుని ధ్యానంపై గురి కుదిరేందుకు స్వామి వివేకానందుడి స్ఫూర్తి దోహదం చేసింది. సాగరాల సంగమ క్షేత్రమే కాక సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అయిన కన్యాకుమారి తోడ్పడింది. కన్యాకుమారిలో ఉదయించే సూర్యుడు నా ఆలోచనలకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాడు. సముద్రం వైశాల్యం నా ఆలోచనలను విస్తరింపజేసింది. చిన్నప్పటి నుంచి ఇలాంటి విలువను నాలో నింపినందుకు దైవానికి రుణపడి ఉంటాను.
ప్రపంచం మనవైపు చూస్తోంది..
యువతే మన దేశానికి బలం.. ప్రపంచం మొత్తం భారతదేశంవైపు ఆశగా చూస్తోంది. ‘ప్రతి దేశానికీ అందించడానికి ఒక సందేశం, నెరవేర్చడానికి ఒక లక్ష్యం, చేరుకోవాల్సిన గమ్యం వుంటాయి’ అని స్వామి వివేకానంద చెప్పారు. వేలాది సంవత్సరాలుగా ఈ అర్థవంతమైన లక్ష్యంతోనే భారత్ ముందుకు సాగుతోంది. మన సంపాదనను పూర్తిగా ఆర్థిక, భౌతిక పరామితుల్లో తూకం వేయలేదు. అందుకే.. ‘ఇదం నమమ (ఇది నాది కాదు)’ అనే భావన మన దేశ సహజ స్వభావంగా మారింది. మన దేశ సంక్షేమం, అభివృద్ధి యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది. స్వాతంత్ర్యం కోసం మనం చేసిన పోరాటం, కరోనా సమయంలో మనం చూపిన ధైర్యం ప్రపంచంలోని ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచాయి. మన పాలన నమూనా అనేక దేశాలకు ఉదాహరణగా మారింది. కేవలం పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం అపూర్వం. జీ-20 విజయం తర్వాత.. భారతదేశం మరింత బృహత్తర పాత్రను పోషించాలన్న భావన ప్రపంచ దేశాల్లో పెరుగుతోంది.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా..
2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత భారత్)’ అనే తీర్మానానికి అనుగుణంగా మనం ఇప్పుడు క్షణం కూడా వృథా చేయకుండా పెద్ద బాధ్యతలు, పెద్ద లక్ష్యాల దిశగా అడుగులు వేయాలి. ఆర్థిక సంస్కరణలతో పాటు జీవితంలోని ప్రతి దశలో సంస్కరణల దిశగా ముందుకు సాగాలి. సంస్కరణలకు సంబంధించి దేశం కోసం నేను.. ‘సంస్కరణ, పనితీరు, పరివర్తన’ అనే విజన్‌ను ప్రతిపాదించాను. సంస్కరణల బాధ్యత నాయకత్వంపై ఉంటుంది. దాని ఆధారంగానే అధికార యంత్రాంగం పనితీరు, ప్రజల భాగస్వామ్యంతో పరివర్తన సాధ్యమవుటాయి. అలాగే, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి.. తయారీతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. ‘జీరో డిఫెక్ట్-జీరో ఎఫెక్ట్’ అనే మంత్రానికి కట్టుబడి ఉండాలి.
వివేకానందుడి స్ఫూర్తిగా..
కాలం చెల్లిన ఆలోచనలు, విశ్వాసాలను.. మనం పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతికూలత నుంచి విముక్తే.. విజయసాధన దిశగా పడే మొదటి అడుగు. అందుకే వివేకానందుడి స్ఫూర్తిగా వచ్చే 25 ఏళ్లను పూర్తిగా జాతికి అంకితం చేద్దాం. 1897లో స్వామి వివేకానంద ‘వచ్చే 50 ఏళ్లనూ దేశం కోసం మాత్రమే అంకితం చేయాలి’ అని పిలుపునిచ్చారు. ఆ తర్వాత సరిగ్గా 50 ఏళ్లకు 1947 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మళ్లీ ఇప్పుడు అలాంటి సువర్ణావకాశం మనకు లభించింది. వచ్చే పాతికేళ్లు జాతికి అంకితం చేసి రాబోయే తరాలకు నవభారతానికి బలమైన పునాదులు వేద్దాం. మన ఈ ప్రయత్నాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అందరం కలిసి వేగంగా అడుగులు వేద్దాం.. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకుందాం.