Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం!

  • కాలిఫోర్నియాలో 23 ఏళ్ల తెలుగు యువతి నితీశా కందుల అదృశ్యం
  • మే 28 నుంచి ఆమె క‌నిపించ‌ట్లేదని పోలీసుల వెల్ల‌డి
  • లాస్‌ఏంజెల్స్‌ పోలీసుల వెతుకులాట 
  • సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ సోషల్‌ మీడియా పోస్టులు

అమెరికాలో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు, అదృశ్యం ఘటనలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఏదో ఒక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో 23 ఏళ్ల తెలుగు యువతి క‌నిపించ‌కుండా పోయింది. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ కోసం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కోరారు. 

నితీశా కందుల కాలిఫోర్నియా రాష్ట్రం లాస్‌ ఏంజెల్స్‌లోని ఎల్లెండేల్ ప్రాంతంలో నివాసం ఉంటూ.. స్టేట్‌ యూనివర్సిటీ శాన్‌ బెర్నార్డినోలో చదువుతోంది. మే 28 నుంచి ఆమె అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. యువతి బంధువుల‌ ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న లాస్‌ఏంజెల్స్‌ పోలీసులు యువతి కోసం వెతుకులాట ప్రారంభించారు. 

యువతి గురించిన సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ ద్వారా స్థానికులను కోరారు. ఈ మేర‌కు సీఎస్‌యూఎస్‌బీ పోలీస్ చీఫ్ జాన్ గుట్టీరెజ్ ఆదివారం ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. నితీశా కందుల ఆచూకీపై సమాచారం ఉన్నవారు (909) 537-5165 నంబర్ ద్వారా త‌మ‌ను సంప్రదించాల‌ని పోలీసులు తెలిపారు.

5 అడుగుల 6 అంగుళాల పొడవు, 160 పౌండ్ల (72.5 కిలోలు) బరువుతో నల్లటి జుట్టు, నల్లని కళ్లతో ఉన్నట్లు పోలీసులు త‌మ‌ ప్రకటనలో ఆమె వివ‌రాల‌ను తెలియ‌జేశారు. నితీశా క‌నిపించ‌కుండాపోయిన స‌మ‌యంలో కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్‌తో 2021 టయోటా కరోలాను నడిపినట్లు పేర్కొన్నారు. ఆమె గురించి సమాచారం ఉన్నవారు  సీఎస్‌యూఎస్‌బీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని (909) 538-7777లో లేదా ఎల్ఏపీడీ సౌత్‌వెస్ట్ డివిజన్‌ని (213) 485-2582లో సంప్రదించవలసిందిగా కోరారు.

అమెరికాలో ఇటీవ‌ల‌ భార‌తీయ విద్యార్థుల వ‌రుస మ‌ర‌ణాలు
గత నెలలో షికాగోలో 26 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింద అనే భారతీయ విద్యార్థి అదృశ్య‌మైన‌ విషయం తెలిసిందే. అంతకుముందు ఏప్రిల్‌లో తప్పిపోయిన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ నగరంలో శవమై కనిపించాడు. హైదరాబాద్‌లోని నాచారంకు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ అనే యువ‌కుడు క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేసేందుకు గతేడాది మే నెల‌లో అమెరికా వెళ్లడం జ‌రిగింది.

అలాగే మార్చిలో ఇండియాకు చెందిన 34 ఏళ్ల శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో కాల్చి చంపబడ్డాడు. అలాగే పర్డ్యూ యూనివర్శిటీలో 23 ఏళ్ల ఇండో-అమెరికన్ విద్యార్థి సమీర్ కామత్ ఫిబ్రవరి 5వ తేదీన ఇండియానాలోని ప్రకృతి సంరక్షణ వ‌నంలో శవమై కనిపించాడు.

ఇక ఫిబ్రవరి 2వ తారీఖున 41 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా వాషింగ్టన్‌లోని ఒక రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అంత‌కుముందు జనవరిలో 18 ఏళ్ల అకుల్ ధావన్ అనే ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ విద్యార్థి క్యాంపస్ భవనం వెలుపల  నిర్జీవంగా క‌నిపించాడు. అతను అల్పోష్ణస్థితి కారణంగా చ‌నిపోయాడ‌ని పరిశోధనల్లో వెల్లడైంది. మ‌ద్యం మత్తులో అతి శీతల ఉష్ణోగ్రతలకు ఎక్కువ స‌మ‌యం బ‌య‌ట ఉండ‌ట‌మే అతని మృతికి కార‌ణ‌మైంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Related posts

కార్గో విమానంలో బోను నుంచి తప్పించుకున్న గుర్రం.. హడలిపోయిన సిబ్బంది

Ram Narayana

అబుదాబి లాటరీలో రూ.34 కోట్ల జాక్ పాట్ కొట్టిన ఎన్నారై.. ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

Ram Narayana

కొలంబియా యూనివర్సిటీ వద్ద పాలస్తీనా అనుకూల ర్యాలీ!

Ram Narayana

Leave a Comment