- ఖర్గే నివాసంలో కూటమి పార్టీల నేతల సమావేశం
- ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్న ఖర్గే
- మోదీ నైతికంగా ఓడిపోయారని వ్యాఖ్య
తమ ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖర్గే నివాసంలో కూటమి పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. నైతికంగా ప్రధాని ఓడిపోయారన్నారు. తమ కూటమిలోకి కొత్త పార్టీలు రావొచ్చునని ఆహ్వానించారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడిందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చునన్నారు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.