Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

రామోజీ రావు అస్త‌మ‌యం….ప్రధాని మోడీ , సీఎంలు చంద్రబాబు , రేవంత్ రెడ్డి సంతాపం ..

  • గ‌త కొంత‌కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న రామోజీరావు
  • ఆరోగ్యం క్షీణించ‌డంతో హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుప‌త్రిలో చికిత్స‌
  • వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచిన రామోజీరావు

తెలుగు మీడియా మొఘల్‌గా పేరుపొందిన ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయ‌న‌ వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్ గూడలోని స్టార్ ఆసుప‌త్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. 

ఈ నెల 5న ఆయ‌న‌కు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్త‌డంతో ప‌రీక్షించిన‌ వైద్యులు స్టెంట్ అమ‌ర్చారు. స్టెంట్ వేసిన త‌ర్వాత ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి కొంచెం క్రిటిక‌ల్‌గా మార‌డంతో ఆసుప‌త్రిలో చేర్పించారు. ఇక 88 ఏళ్ల రామోజీరావు గ‌త కొంత‌కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆసుప‌త్రిలో చికిత్స పొందారు.

కాగా, రామోజీరావు మీడియాతోపాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్‌ సిటీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరావు నడిపిస్తున్నారు. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం విదిత‌మే.

రామోజీరావు మృతిపై ప్ర‌ధాని మోదీ సంతాపం

Narendra Modi Pay Tribute Ramoji Rao
  • రామోజీరావు మృతి చాలా బాధాకరమ‌న్న ప్ర‌ధాని
  • భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన‌ దార్శనికుడ‌ని కితాబు
  • మీడియా, వినోద ప్రపంచంలో ఆయ‌న‌ చెరగని ముద్ర వేశారంటూ వ్యాఖ్య‌

మీడియా మొఘ‌ల్ రామోజీరావు మృతిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా రామోజీ మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. “రామోజీరావు మృతి చాలా బాధాకరం. ఆయ‌న‌ భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన‌ దార్శనికుడు. ఆయ‌న‌ గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి. మీడియా, వినోద ప్రపంచంలో ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారు.

రామోజీరావు భారతదేశ అభివృద్ధి పట్ల ఎంతో మక్కువ చూపేవారు. ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న‌తో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవ‌కాశం ల‌భించ‌డం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్ర‌గాఢ‌ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.

రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

  • రామోజీరావు తెలుగు వెలుగు.. ఆయన మృతి తీరని లోటు అన్న టీడీపీ అధినేత‌
  • ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారంటూ కితాబు
  • రామోజీని తెలుగు ప్రజల ఆస్తిగా పేర్కొన్న చంద్ర‌బాబు
  • అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారంటూ వ్యాఖ్య‌

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత‌ గుర్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. 

తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని చంద్రబాబు తెలిపారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. 

ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో ఆయ‌న‌ సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని కితాబునిచ్చారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రామోజీరావుతో తనకున్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు.. తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందన్నారు. స‌మస్యలపై పోరాటంలో ఆయన తనకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని చెప్పారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.

మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్ రెడ్డి

  • తెలుగు మీడియా రంగానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారన్న సీఎం రేవంత్
  • ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైనం
  • రామోజీరావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం
  • తెలుగు మీడియాకు ఆయన సేవలు అమూల్యమైనవని ప్రశంసలు

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. రామోజీరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్  వేదికగా పోస్టు పెట్టారు. 

రామోజీరావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా సంతాపం తెలియజేశారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఆయన మరణ వార్త తీవ్ర విషాదానికి గురి చేసిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రామోజీరావుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి నివాళి

  • మీడియా మొఘల్ మృతిపై ప్రముఖుల సంతాపం
  • వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారంటూ రామోజీరావుకు వెంకయ్య నాయుడి నివాళి
  • ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతమంటూ సినీ నటులు చిరంజీవి పోస్ట్

అనారోగ్యంతో కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీ రావుకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. ‘రామోజీరావు వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’’ అని వెంకయ్య నాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రామోజీరావు మృతిపై సినీనటులు చిరంజీవి కూడా సంతాపం తెలిపారు.‘‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికెగిసింది’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 

గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యులు స్టెంట్ అమర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు.

రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలి: వైఎస్‌ జగన్

YS Jagan Pay Tribute Ramoji Rao

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సంతాపం తెలిపారు. “రామోజీ రావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

రామోజీరావు

చెరుకూరి రామోజీరావు
ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడు అధిపతి రామోజీరావు
జననంచెరుకూరి రామయ్య
1936 నవంబరు 16
గుడివాడ,కృష్ణా జిల్లా
మరణం2024 జూన్ 8 (వయసు 87)
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లురామోజీ
వృత్తిపత్రికా సంపాదకుడు
ప్రచురణకర్త
చిత్ర నిర్మాత
వ్యాపారవేత్త
ఈటీవీ అధినేత
ప్రసిద్ధిపత్రికాధిపతి
మతంహిందూ
భార్య / భర్తరమాదేవి[1]
పిల్లలుకిరణ్, సుమన్

చెరుకూరి రామోజీరావు (1936 నవంబరు 16 – 2024 జూన్ 8), ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.

బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 – 1961)]

ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి.

రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా “రామోజీ రావు” అన్న పేరును సృష్టించుకుని, తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివాడు.

1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.

రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగివచ్చాడు.

రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967 – 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగింది.

డాల్ఫిన్ హోటల్స్, ఈనాడు ప్రారంభం (1971-1974)

విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకుని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు.

రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూములు ముఖ్యమైనవి.

రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బిఐ నిబంధనలు ఉల్లంఘించిందని అనే ఆరోపణలు ఎదుర్కొంది. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని బయటపడింది.రామోజీరావు మార్గదర్శిలోని ఖాతాదారుల డబ్బుల్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఆస్తులను జప్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. మార్గదర్శి కేసు విషయంపై రామోజీరావును విచారించింది.

మీడియా

  • తెలుగు దినపత్రిక ఈనాడు
  • ఆంగ్ల దినపత్రిక– న్యూస్ టైమ్ (ముతపడినది)
  • వసుంధర పబ్లికేషన్స్: సితారఅన్నదాత
  • రామోజీ ఫౌండేషన్: చతురవిపులఅన్నదాతతెలుగు వెలుగు, బాలభారతం పత్రికలు 2021 మార్చి సంచికతో మూతపడ్డాయి.
  • ఈ టీవి, ఈటివి 2, ఈ టివి కన్నడ, మరాఠి, ఉర్దు, బెంగాలి, ఒరియా, గుజరాతీ, బీహార్
  • రామోజీ ఫిల్మ్ సిటీ
  • ఉషా కిరణ్ మూవీస్
  • కళాంజలి – సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి (విజయవాడ, హైదరాబాద్)
  • బ్రిసా – ఆధునిక వస్త్రాలు
  • ప్రియా ఫుడ్స్ – పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
  • డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం, హైదరాబాద్)
  • కొలోరమ ప్రింటర్స్
  • ప్రియా పచ్చళ్లు

నిర్మించిన సినిమాలు

పురస్కారాలు/గౌరవాలు

రామోజీరావు పనికి, సేవలకు పలు పురస్కారాలు అందుకున్నాడు.

మరణం

రామోజీరావు 87 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో 2024 జూన్ 8న హైదరాబాదులో తుదిశ్వాస విడిచాడు.

Related posts

లోకేశ్ కు క్రిస్మస్ కానుకలు పంపిన షర్మిల…. ఫొటోలు ఇవిగో!

Ram Narayana

శ్రీరామరక్షాస్తోత్రమ్ మొక్కుబడి పుస్తకం కాదు: భద్రాద్రి వేదపండితులు

Ram Narayana

చంద్రబాబుకు మద్దతుగా వేలాదిగా తరలి వచ్చిన ఐటీ ఉద్యోగులు.. విప్రో సర్కిల్ వద్ద ఉద్రిక్తత

Ram Narayana

Leave a Comment