Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం: నరేంద్ర మోదీ…

ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక మోదీ తొలి వ్యాఖ్యలు ఇవే

  • ‘పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత’ విధానం కొనసాగిస్తామని మోదీ వెల్లడి
  • ‘సాగర్ విజన్’ పట్ల నిబద్ధతతో పనిచేస్తామని పొరుగు దేశాల అధిపతులకు హామీ
  • ఈ ప్రాంతంలోని దేశాల గొంతును అంతర్జాతీయ వేదికపై వినిపిస్తామన్న మోదీ
  • ప్రమాణస్వీకారం అనంతరం విదేశీ అతిథులతో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

రికార్డు స్థాయిలో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదాకలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. ముఖ్యంగా భారత్ పొరుగున ఉన్న ఏడు దేశాల అధిపతులు విచ్చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల అగ్రనేతలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ ఈ వేడుకకు హాజరయ్యారు.

పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం: నరేంద్ర మోదీ
‘మోదీ 3.0 కేబినెట్’ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన పొరుగు దేశాల నేతలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తొలి ప్రసంగంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత’ విధానాన్ని కొనసాగించనున్నామని మోదీ స్పష్టం చేశారు. ‘సాగర్ విజన్’కు కట్టుబడి, నిబద్ధతతో భారత్ పనిచేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. తన మూడో దఫా ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, సంక్షేమం కోసం భారత్ నిర్విరామంగా కృషి చేస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. 

2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ.. ఈ ప్రాంతంలోని దేశాలతో సన్నిహిత భాగస్వామ్యాలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రజల మధ్య సంబంధాలు, అనుసంధానానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత దేశాల గొంతును అంతర్జాతీయ వేదికపై భారత్ వినిపిస్తుందని, ఈ దిశగా కృషి చేస్తుందని విదేశీ నేతలకు మోదీ వాగ్దానం చేశారు. ఈ మేరకు విదేశీ అతిథుల వద్ద ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

విదేశీ అతిథుల విందులో మోదీ
చారిత్రాత్మకంగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి విదేశీ అతిథులు అభినందనలు తెలియజేయగా.. ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారని విదేశాంగశాఖ తెలిపింది. కాగా ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణస్వీకారోత్సవంలో విదేశీ అతిథులు పాల్గొనడం వారి దేశాలతో భారత్‌కు ఉన్న బలమైన బంధాలను చాటి చెబుతున్నాయని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఈ ప్రాంతంలోని ఆ దేశాలతో స్నేహ,  సహకారాలు కొనసాగుతాయని పునరుద్ఘాటించింది. కాగా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన విదేశీ నేతలకు ఇచ్చిన విందులో మోదీ పాల్గొన్నారు.

Related posts

విమానం లేటైతే ప్రయాణికులు అందులోనే కూర్చోవాల్సిన పనిలేదు.. బీసీఏఎస్ కొత్త మార్గదర్శకాలు

Ram Narayana

కాంగ్రెస్‌తో పర్మినెంట్ పెళ్లేమీ కాలేదు!: పొత్తుపై అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్య…

Ram Narayana

వచ్చేది ‘ఇండియా’ ప్రభుత్వమే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన మమత

Ram Narayana

Leave a Comment