- తెలంగాణ సీఎం, ఎంపీలు, కేంద్రమంత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తే పరిష్కరిస్తానని హామీ
- సివిల్ ఏవియేషన్స్ మినిస్ట్రీ ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువయ్యే అవకాశం దక్కిందని వ్యాఖ్య
- తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానన్న రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తాను ఆ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని కేంద్రమంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఎంపీలు, కేంద్రమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి… ఇలా ఎవరి నుంచి తనకు విజ్ఞప్తులు వచ్చినా మరో ఆలోచన లేకుండా ఆ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తన సహకారంతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారని… ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
‘ఆ అనుబంధం (ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య) ఎప్పుడూ కొనసాగించాలి. సివిల్ ఏవియేషన్స్ మంత్రిత్వ శాఖ ద్వారా మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది. తెలంగాణపై కూడా దృష్టి పెడతాను. అక్కడ (తెలంగాణ) ఉన్నటువంటి సమస్యలు నా దృష్టికి వస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రాంతానికి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తా’నని కేంద్రమంత్రి అన్నారు.
పార్లమెంట్‌లో నేను మాట్లాడింది ఏపీ ప్రజలూ విన్నారు
గతంలో పార్లమెంట్‌లో తాను మాట్లాడుతూ, ‘రెండు నిమిషాలు టైమివ్వండి… భవిష్యత్తులో ఎంతమంది ఎంపీలు కావాలో తీసుకువస్తాను’ అని చెప్పానని… నాటి తన మాటలను స్పీకర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విన్నారని వ్యాఖ్యానించారు. అందుకే నాడు ముగ్గురు ఎంపీల నుంచి ఈ రోజు 21 మంది ఎన్డీయే ఎంపీలను గెలిపించారన్నారు. అందుకే ఏపీ ప్రజలకు తాను థ్యాంక్స్ చెబుతున్నానన్నారు.
ప్రధాని మోదీ ఎంతో నమ్మకంతో నాకు సివిల్ ఏవియేషన్స్ శాఖను అప్పగించారు: రామ్మోహన్ నాయుడు
- భారత రెప్యుటేషన్, మోదీ రెప్యుటేషన్‌ను నా చేతిలో పెడుతున్నానని ప్రధాని చెప్పారన్న రామ్మోహన్
- ఇది తనకు చాలా పెద్ద బాధ్యత… వయస్సుకు మించిందని వ్యాఖ్య
- నితిన్ గడ్కరీ నాకు ఆదర్శమన్న రామ్మోహన్ నాయుడు
- రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఆయన అద్భుతాలు సృష్టించారని ప్రశంస
- సివిల్ ఏవియేషన్స్‌లోనూ తన మార్క్ తీసుకువస్తానన్న రామ్మోహన్ నాయుడు
ప్రధాని నరేంద్రమోదీ ఎంతో నమ్మకంతో పౌరవిమానయాన శాఖను తనకు అప్పగించారని… ఆయనకు ఇది ప్రెస్టేజ్ మినిస్ట్రీ అని తనతో చెప్పారని కేంద్రమంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… భారత రెప్యుటేషన్, మోదీ రెప్యుటేషన్‌ను అంతర్జాతీయస్థాయిలో నీ చేతిలో పెడుతున్నానని ప్రధాని మోదీ నిన్న తనతో అన్నారని గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలకు సేవలు అందించాలని సూచించారన్నారు. నిన్న కేబినెట్ భేటీ తర్వాత ప్రధాని మోదీ తనతో మాట్లాడినట్లు చెప్పారు.
ఇది తనకు చాలా పెద్ద బాధ్యత అని… వయస్సుకు మించినదని అన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సహకారం తీసుకొని ముందుకు సాగుతానని చెప్పారు. ఇదివరకు సివిల్ ఏవియేషన్స్ మినిస్టర్‌గా పని చేసిన జ్యోతిరాదిత్య సింధియాను కూడా కలిసి సలహాలు, సూచనలు తీసుకుంటానన్నారు. త్వరలో బాధ్యతలు చేపట్టి.. సివిల్ ఏవియేషన్‌కు సంబంధించి దేశానికి, రాష్ట్రానికి ఒక విజన్ తయారు చేసి ముందుకు సాగుతామన్నారు. తిరుపతి, విజయవాడ సహా ఏపీలో ఉన్న విమానాశ్రయాలలో ఇన్‌ఫ్రాను అభివృద్ధి చేస్తామన్నారు.
సివిల్ ఏవియేషన్స్‌లో తనకంటూ ప్రత్యేక మార్క్ తీసుకువచ్చేలా పని చేస్తానని తెలిపారు. తనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదర్శమని… ఆయన రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌లో అద్భుతాలు సృష్టించారని ప్రశంసించారు. గడ్కరీ అంటే రోడ్లు… రోడ్లు అంటే గడ్కరీ అన్న విధంగా ఇప్పుడు తయారయిందన్నారు. అందుకే మరోసారి ఆయనకు అదే శాఖను అప్పగించారని గుర్తు చేశారు. అలాగే, రేపు… భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్స్‌కు సంబంధించిన చర్చ జరిగితే రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు ఇలా జరిగింది అనే మార్క్ తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తనను యంగెస్ట్ మినిస్టర్ అనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే ఇది అదనపు బాధ్యత అవుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే అందరి దృష్టి తనపైనే ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా ఏవియేషన్ మినిస్ట్రీలో తన మార్క్ ఉండాలనేది తన ఉద్దేశ్యమన్నారు. గతంలో ఎలా జరిగిందో తెలుసుకుంటానని… ఆ ప్రకారం ముందుకు సాగుతానని అన్నారు. ఎల్లుండి బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు.
అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వారితో తనకు అనుబంధం ఉందని… అలాగే రాష్ట్ర సమస్యలు తనకు తెలుసునని రామ్మోహన్ నాయుడు చెప్పారు. అందుకే ఇతర మంత్రులతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనకు కావాల్సినవి తెచ్చుకునే వెసులుబాటు ఉందన్నారు.