- కువైట్ లోని ఓ భవనంలో అగ్నిప్రమాదం
- కిచెన్ లో మొదలైన మంటలు నిమిషాల్లో భవనం మొత్తం వ్యాప్తి
- తప్పించుకునే వీల్లేక మంటల్లో చిక్కుకున్న కార్మికులు
- 49 మంది మృత్యువాత… 50 మందికి పైగా గాయాలు
గల్ఫ్ దేశం కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 49 మంది సజీవ దహనం కాగా, వారిలో 40 మంది భారతీయులు ఉన్నారు. 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలోనూ 30 మంది వరకు భారతీయులు ఉన్నట్టు గుర్తించారు.
మంగాఫ్ ప్రాంతంలోని ఓ కంపెనీకి చెందిన భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, కార్మికులు ఆ భవనంలో చిక్కుకుపోయారు. ఆరు అంతస్తుల ఆ భవనంలో 160 మంది వరకు కార్మికులు నివాసం ఉంటున్నారు.
వంట గదిలో మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలో మొత్తం పాకిపోయాయి. తప్పించుకునే వీల్లేక కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
కువైట్ అగ్నిప్రమాదంలో పదుల సంఖ్యలో భారతీయులు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కువైట్ లోని భారత దౌత్యకార్యాలయం ఈ ప్రమాద ఘటన, తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
కాగా, కువైట్ లోని భారత దౌత్య కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ నెంబరును ప్రకటించింది. సహాయ, సమాచారాల కోసం +965-65505246 నెంబరును ఫోన్ చేయాలని సూచించింది.