Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి!

  • బీఆర్ఎస్ కు షాకిచ్చిన పోచారం.. ఇంటిముందు నేతల ఆందోళన
  • రైతుల కష్టాలు తీరాలనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటన
  • తమ నేతలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న హరీశ్ రావు

బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీ మారారు.

రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని, రాజకీయంగా తానేమీ ఆశించట్లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, రైతుల సంక్షేమం కోసం నిజాయతీగా పాటుపడుతోందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అన్నదాతను ఆదుకునే విషయంలో వెనుకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైందని ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రగతి, రైతుల ప్రగతి కోసం పనిచేస్తానని వివరించారు.

బీఆర్ఎస్ నేతల ఆందోళన.. హరీశ్ రావు ఫైర్
పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన విషయం తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశాయి. లోపల పోచారం, రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా ఇంటి బయట బీఆర్ఎస్ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కల్పించుకుని వారిని అక్కడి నుంచి తరలించారు. కాగా, తమ పార్టీ నేతలను ప్రభుత్వం బెదిరించి, భయపెట్టి పార్టీ మారేలా చేస్తోందంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. విచారణ సంస్థలతో కేంద్రం, బెదిరింపులతో రాష్ట్ర ప్రభుత్వం తమ నేతలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. దీంతో మరో మార్గంలేక తమ నేతలు పార్టీ ఫిరాయిస్తున్నారని చెప్పారు.

Related posts

గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై ఈటల పోటీ… బీజేపీ సాహసోపేత నిర్ణయం

Ram Narayana

ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ …!

Ram Narayana

గంగులపై పోటీ చేస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్, బీజేపీలకి బాగా తెలుసు: కేటీఆర్

Ram Narayana

Leave a Comment