హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను విడిచిపెడుతున్న అమెరికా..
- హవాయి దీవుల్లో అరుదైన పక్షిజాతి
- దోమకాటుతో అంతరించిపోతున్న వైనం
- వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమల ఉత్పత్తిని ప్రారంభించిన ప్రభుత్వం
- ఈ దోమలను కలిసిన ఆడదోమలు గుడ్లకు దూరం
అమెరికాలోని హవాయి దీవుల్లో అక్కడి ప్రభుత్వం హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను విడిచిపెడుతోంది. ఈ దీవుల్లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్) మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధికారక దోమ కుడితే పక్షులు చనిపోయే ముప్పు 90 శాతం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి వీటికి లేకపోవడమే అందుకు కారణం.
ఈ నేపథ్యంలో పక్షిజాతిని రక్షించుకునేందుకు చర్యలు ప్రారంభించిన హవాయి రాష్ట్ర ప్రభుత్వం వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమల ఉత్పత్తిని ప్రారంభించింది. వాటితో కలిసిన ఆడదోమలు గుడ్లు పొదగలేవు. కాబట్టి క్రమంగా వాటి సంతతిని నివారించవచ్చన్నది ప్రభుత్వ యోచన. దీనిని ‘ఇన్‌కంపాటబుల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్’గా వ్యవహరిస్తారు. యూఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ సహాయంతో హవాయి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చైనా, మెక్సికోలోనూ దోమల నివారణకు ఇలాంటి విధానాన్నే అవలంబిస్తున్నారు.