Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు షాక్.. వీసా ఫీజు రెట్టింపు చేసిన ఆస్ట్రేలియా…

  • స్టూడెంట్ వీసా ఫీజు 710 నుంచి 1,600 ఆస్ట్రేలియా డాలర్లకు పెంపు
  • నేటి నుంచే పెంచిన ఫీజు అమలు
  • విదేశీ విద్యార్థుల కట్టడికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ఈ నిర్ణయం వల్ల ఇక పరిమితంగానే విద్యార్థుల వలసలు ఉంటాయని ఆశిస్తున్నట్లు వెల్లడి

అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి పెరిగిపోతుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీసా ఫీజును రెట్టింపుకన్నా ఎక్కువ పెంచింది. జులై ఒకటో తేదీ నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా ఫీజును ప్రస్తుతమున్న 710 ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు రూ. 39,500) నుంచి ఏకంగా 1,600 ఆస్ట్రేలియా డాలర్లకు (సుమారు రూ. 89,000) పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అలాగే విజిటర్ వీసాదారులతోపాటు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలు పొందిన విద్యార్థులు ఆన్ షోర్ దరఖాస్తులు చేసేందుకు వీల్లేకుండా స్టూడెంట్ వీసాలపై నిషేధం విధించింది.

ఈ నిర్ణయం వల్ల ఆస్ట్రేలియాకు న్యాయంగా, పరిమితంగా, మరింత మెరుగ్గా విద్యార్థుల వలసలు ఉంటాయని ఆశిస్తున్నట్లు ఆ దేశ హోంమంత్రి క్లారె ఓనీల్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే వీసా నిబంధనల్లో లోపాలను కూడా సరిదిద్దినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. విదేశీ విద్యార్థులు వీసా గడువును నిరంతరం పొడిగించుకొనే వెసులుబాటును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 2022–23లో 1.50 లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థులు సెకండ్ లేదా తదుపరి స్టూడెంట్ వీసాలపై దేశంలోనే గడువు పొడిగించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం మార్చిలో విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2023 సెప్టెంబర్ 30 నాటికి 5,48,800 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుల కోసం వచ్చారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో 60 శాతం పెరుగుదల కావడం గమనార్హం. 2022లో కోవిడ్ ఆంక్షల ఎత్తివేత అనంతరం స్టూడెంట్ వీసా నిబంధనలను ఆస్ట్రేలియా కఠినతరం చేస్తూ వస్తోంది.

అమెరికా, కెనడాతో పోలిస్తే ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసా ఫీజు మరింత భారం కానుంది. ప్రస్తుతం అమెరికాలో 185 డాలర్లు (సుమారు రూ. 15,400) , కెనడాలో 150 కెనడా డాలర్లు (సుమారు రూ. 11,300)గా వీసా ఫీజులు ఉన్నాయి.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా సీఈవో ల్యూక్ షీహీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా యూనివర్సిటీలకు ఈ నిర్ణయం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. దేశంలోని యూనివర్సిటీలన్నీ ఆదాయంపై ఎక్కువగా అంతర్జాతీయ విద్యార్థి వీసా ఫీజులపైనే ఆధారపడతాయని చెప్పారు.

ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఎగుమతి పరిశ్రమల్లో విదేశీ విద్య కూడా ఒకటి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ద్వారా ఆస్ట్రేలియా 36.4 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ఆదాయం ఆర్జించింది.

Related posts

విద్యార్థి నేతలకు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు

Ram Narayana

వాషింగ్టన్‌లో భారతీయ అధికారి అనుమానాస్ప‌ద మృతి!

Ram Narayana

అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అధ్యక్షుడు జో బైడెన్ భార్యకు పాజిటివ్

Ram Narayana

Leave a Comment