ఉప్పు ముప్పే …. ఆహారంలో ఉప్పు ఎక్కువైతే ఇమ్యూనిటీ తగ్గడం ఖాయం
రోగనిరోధక శక్తి బాగుండాలా?.. అయితే, ఉప్పు తగ్గించేస్తే సరి!
ఆహారంలో ఉప్పు ఎక్కువైతే ఇమ్యూనిటీకి ముప్పు
కిడ్నీల్లో ఈ–కొలి ఇన్ ఫెక్షన్లకు కారణం
కిడ్నీ ఇన్ ఫెక్షన్లపై పోరాడే న్యూట్రోఫిల్స్ స్పందన తగ్గుదల
మరిన్ని అవయవాలపైనా దాని ప్రభావం
ఉప్పు లేని పప్పు నాలుకకు రుచిస్తుందా? మాంసాహారంలో ఉప్పు నిండుగా లేకుంటే నోరు ఊరుకుంటుందా? ఉప్పు లేని మజ్జిగ, ఉప్పు లేని కూరలు ఊహించుకోగలమా! అవును మరి, ఏ కారాలు, మసాలాలు ఎన్నేసినా.. కొంచెమంత ఉప్పు తగలకపోతే ఆ కూరకు రుచి, పచి రాదు కదా. ఉప్పులేని వంటకు విలువలేదు మరి!
అయితే, దాని వల్ల ఎన్ని లాభాలున్నాయో.. నష్టాలూ అన్నే ఉన్నాయి. రక్తంలో సోడియం, క్లోరైడ్ లవణాలు సమతుల్యంగా ఉండడంలో ఉప్పుది కీలక పాత్ర. నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ మంచిగా పనిచేసేందుకు సోడియం దోహదం చేస్తుంది. శరీరంలోని ద్రవపదార్థాలను నియంత్రిస్తుంది. శరీర కణాల లోపల, బయట సరైన మోతాదులో ద్రవపదార్థాలు ఉండేలా క్లోరైడ్ చూసుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యం రక్తపోటులోనూ వాటిదే కీలకపాత్ర.
కానీ, అతి సర్వత్రా వర్జయేత్ అన్న నానుడి ఉప్పుకు బాగా వర్తిస్తుంది. మితంగా తింటే ఔషధంగా పనిచేసినా.. పరిమితి దాటితే మాత్రం అది విషమే సుమా. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే అయినా.. ఇప్పుడు ఇంకో కొత్త మాయదారి ఎఫెక్ట్ వస్తోంది.
కరోనా సమయంలో అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మంచి ఆహారంపై దృష్టి పెట్టారు. ఆ రోగనిరోధక శక్తినే ఉప్పు తగ్గించేస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బ్యాక్టీరియాపై రోగనిరోధక కణం పోరాడే శక్తి తగ్గిపోతుంది. కొన్ని అవయవాల్లో బ్యాక్టీరియాను చంపేసే శక్తి మన రోగ నిరోధక వ్యవస్థకు సన్నగిల్లుతుంది. ఉప్పు వినియోగం ఎక్కువైతే విరేచనాలకు కారణమయ్యే, పేగులు, కడుపులో ఎక్కువగా ఉండే ఎష్కరేషియా కోలి (ఈ–కొలి) బ్యాక్టీరియా వల్ల కిడ్నీల్లోనూ ఇన్ ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ ఫెక్షన్లపై పోరాడే న్యూట్రోఫిల్ అనే రోగనిరోధక కణాల స్పందన గుణం తగ్గిపోతుంది.
రోజుకింతే…
మనం ఇప్పుడు కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. దాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దాలంటే ఉప్పు తగ్గించాల్సిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం రోజులో ఉప్పు వినియోగం కేవలం 5 గ్రాములు దాటకుండా చూసుకోవాలి. అంటే ఓ టీ స్పూన్ అన్నమాట. పిల్లలకైతే పెద్దలు తీసుకునే మోతాదు కన్నా తక్కువగానే ఉండాలి. తల్లి పాలు తాగే 6 నెలల లోపు పిల్లలు, బయటి పాలు, ఆహారం తీసుకునే 6 నుంచి 24 నెలల లోపు పిల్లల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. కాబట్టి తినే ఆహారంలో ఉప్పును తగ్గించేసేయండి. ఉప్పు ఎక్కువగా ఉండే బయటి ఫుడ్ కు దూరంగా ఉండండి.