Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

10 ఏళ్లకుపైగా శారీరక సంబంధం.. పెళ్లి చేసుకోనన్నాడని రేప్ కేసు పెట్టిన మహిళ.. హైకోర్టు సంచలన తీర్పు

  • రేప్ కేసు సమర్థనీయం కాదంటూ కొట్టివేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు
  • ఈ కేసు చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్య
  • స్త్రీని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలని కూడా కేసు పెట్టలేమని తేల్చి చెప్పిన న్యాయస్థానం

ఓ జంట ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛగా పదేళ్ల పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించింది. అయితే ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు పురుషుడు నిరాకరించాడు. దీంతో సదరు వ్యక్తిపై మహిళ పెట్టిన అత్యాచారం కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన రీతిలో కొట్టివేసింది. 10 ఏళ్లకు పైగా స్వేచ్ఛగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని, పిటిషనర్‌పై (పురుషుడు) అత్యాచారం కేసు నమోదు చేయడం సమర్థనీయం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఉందని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు. ఈ మేరకు పిటిషనర్‌పై కేసు కొట్టివేయాలంటూ జులై 2న కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

‘‘ కేసు వాస్తవ పరిస్థితుల ప్రకారం… ప్రతివాది (మహిళ) ఫిర్యాదు, ఐపీసీలోని సీఆర్‌పీసీ 164 కింద ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 375 కింద దీనిని రేప్ కేసుగా పరిగణించలేము అనేది నా అభిప్రాయం. ఈ కేసు విచారణ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తోంది’’ అని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు.

స్త్రీ, పురుషుడు ఇద్దరూ బాగా చదువుకున్న వ్యక్తులు అని, ఏకాభిప్రాయంతో ఇద్దరూ 10 ఏళ్లకుపైగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని తేలిందని కోర్టు వెల్లడించింది. ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోబోనని నిరాకరించడంతో ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని, పురుషుడిపై అత్యాచారం కేసు నమోదు చేయడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. స్త్రీని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ కూడా పురుషుడిపై కేసు పెట్టలేమని (ఐపీసీ సెక్షన్ 366) కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి పురుషుడిపై ఆ తర్వాతి కాలంలో ఐపీసీ సెక్షన్ 366 కింద పెట్టిన కేసును కూడా రద్దు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. 

కాగా మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 2021లో ఈ కేసు నమోదయింది. అత్యాచారం, ఇతర అభియోగాల కింద వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. అయితే తనపై కేసులు అక్రమమని, తనకు ఉపశమనం కల్పించాలంటూ పురుషుడు హైకోర్టును ఆశ్రయించాడు.

Related posts

ఆప్ నేత సిసోడియా కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Ram Narayana

మంత్రి సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా… రేపు నాగార్జున వాంగ్మూలం న‌మోదు

Ram Narayana

మంత్రివర్గం సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలి: సుప్రీం కోర్టు

Ram Narayana

Leave a Comment