- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- 1992 ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్
- హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రస్తుత డీజీపీ రవిగుప్తా బదిలీ
తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. డీజీపీ నియామకంపై మంగళవారమే ఉత్తర్వులు రావాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటన కారణంగా నేటికి వాయిదా పడింది.
జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పని చేశారు. అనంతరం ఢిల్లీ సీబీఐలో, 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో పని చేశారు. ఆ తర్వాత డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు.
అప్పాలో కొంతకాలం పని చేశారు. ఆ తర్వాత వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా పని చేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీఐజీగా, జైళ్ల శాఖ డీజీగా పని చేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. డీజీపీగా ఆయన 14 నెలలు కొనసాగే అవకాశముంది.