- నార్త్ సెంట్రల్ నైజీరియాలో కుప్పకూలిన స్కూలు భవనం
- 22 మంది విద్యార్థుల దుర్మరణం, 132 మంది క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స
- నదీ తీరం సమీపంలో నిర్మించడంతో భవనం బలహీనపడి కూలిందంటున్న అధికారులు
నైజీరియాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ప్లాటూ ప్రాంతంలోగల సెయింట్స్ అకాడమీ కాలేజీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 20 మందికి పైగా విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో స్కూల్‌లో సుమారు 154 మంది విద్యార్థులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న 132 మందిని కాపాడి స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. 22 మంది మృత్యువాత పడ్డట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించాలని, దరఖాస్తులు నింపాలంటూ వేధించవద్దని ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు ప్లాటూ ప్రాంతం పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
మరోవైపు, స్కూల్ కూలిన ప్రాంతానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. క్షతగాత్రులను వెలికి తీసేందుకు ఎమర్జెన్సీ సిబ్బందితో పాటు జాతీయ ఎమెర్జెన్సీ మేనేజ్‌మెంట్ కూడా పాల్గొంది. స్కూలు ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలతో ప్రాంతమంతా విషాదవాతావరణం కనిపించింది.
స్కూల్ భవనంలో నిర్మాణపరమైన లోపాలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. నదీ తీరానికి సమీపంలో నిర్మించడంతో భవనం బలహీనపడిందని తెలిపారు. భనవం నిర్వహణ కూడా సరిగా లేదన్నారు. కాగా, ఆఫ్రికాలో అత్యధిక జనాభా గల నైజీరియాలో భవనాలు కూలడం నిత్య కృత్యంగా మారింది. భవనం నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడం మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని అక్కడి అధికారులు చెబుతుంటారు.