బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అరికెపూడి గాంధీ
- బీఆర్ఎస్‌కు వరుస షాకులు
- అధినేత బుజ్జగిస్తున్నా ఆగని వలసలు
- ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు
- కండువా కప్పి గాంధీని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్
పదేళ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్‌కు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలస ప్రవాహం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై బుజ్జగిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేల వలసలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోగా, తాజాగా ఈ రోజు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పెరిగింది.