Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్‌ ఔట్‌…

  • పార్టీ, దేశ ప్రయోజనాల కోసం వైదొలగుతున్నట్టు వెల్లడి
  • ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌కు మద్దతు ప్రకటన
  • పార్టీలో అంతర్గత ఒత్తిడితో ఎట్టకేలకు జో బైడెన్ కీలక నిర్ణయం

అధికార డెమొక్రాటిక్ పార్టీలో అంతర్గత ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారీస్‌కు ఎన్నికల్లో పోటీ పడేందుకు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు. పార్టీ సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.

డెమోక్రాట్ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ తాను నామినేషన్‌ను ఆమోదించకుండా పరిపాలనపైన దృష్టి పెట్టాలనుకుంటున్నానని బైడెన్ స్పష్టం చేశారు. 2020లో తాను అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించగానే మొదటగా కమలా హారీస్‌ను ఉపాధ్యక్షురాలిగా నియమించానని, ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆమె తనకు ఎంతగానో సహకరించారని, తన వారసురాలిగా ఆమెను ఆమోదిస్తున్నానంటూ బైడెన్ పేర్కొన్నారు. కమలా హారీస్‌కు తాను పూర్తిస్థాయిలో మద్దతిస్తానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ట్రంప్‌ను ఓడిద్దామంటూ బైడెన్ పిలుపునిచ్చారు. తన పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని, పార్టీ నిర్ణయం మేరకు దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు.

 ఇక ప్రియమైన అమెరికన్లకు అని సంభోదిస్తూ.. అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ పేర్కొన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో చక్కటి పురోగతి సాధించామని, నేడు అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఉందని అన్నారు. దేశ పునర్నిర్మాణంలో ఎంతో కృషి చేశామని, డ్రగ్స్‌ను నిరోధించామని, తుపాకీ సంస్కృతికి చెక్‌ పెట్టేలా చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు కొవిడ్‌ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లామని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురుకాకుండా వ్యవహరించామని అన్నారు. 

కాగా అధ్యక్ష ఎన్నికల రేసు తప్పుకునేదే లేదన్నట్టుగా ఇంతకాలం వ్యవహరించిన జో బైడెన్ ఎట్టకేలకు పార్టీలో అంతర్గత ఒత్తిడికి తలొగ్గారు. వయసు మీద పడడంతో ఆయన పలు సందర్భాల్లో తికమకకు గురవుతుండడం, హత్యాయత్నం తర్వాత ట్రంప్ అదరణ మరింత పెరిగిపోవడంతో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలనే ఒత్తిడి ఆయనపై పెరిగింది. పర్యవసానంగా తాజా నిర్ణయం వెలువడిందని అమెరికా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Related posts

చుట్టూ సముద్రం… మధ్యలో రెస్టారెంట్… ఎక్కడో చూడండి!

Ram Narayana

ఇమ్రాన్ ఖాన్ కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల పాటు అనర్హత వేటు

Ram Narayana

సరైన సమయంలో ఇరాన్‌పై ప్రతీకారం.. ఇజ్రాయెల్ ప్రకటన

Ram Narayana

Leave a Comment