Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీలో శాంతిభద్రతలపై మాజీ సీఎం జగన్ నాయకత్వంలో దేశరాజధాని ఢిల్లీలో ధర్నా …

ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ కార్యకర్తల టార్గెట్ గా దాడులు , హత్యలు , విధ్వంసాలు జరుగుతున్నాయని దేశరాజధాని ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ ధర్నా చేసింది …దీనికి ఎన్డీయేతర పార్టీలు మద్దతు ప్రకటించాయి….తమ మద్దతు ఉంటుందని వెల్లడించాయి…ప్రత్యేకంగా ఈ ధర్నాలో ఇండియా కూటమికి చెందిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , శివసేన (ఉద్దవ్ )కు చెందిన సంజయ్ రౌత్ , ప్రియాంక చతుర్వేది మద్దతు ప్రకటించారు …తమ అనుకున్న లక్ష్యం నెరవేరిందని చంద్రబాబు అకృత్యాలను దేశానికి తెలపాలని అనుకున్నామని అందులో సక్సెస్ అయ్యామని వైసీపీ అభిప్రాయపడింది .. అయితే టీడీపీ జగన్ ఇక్కడ దాక వచ్చి ఆందోనళ చేయడం టైం వేస్ట్ అని అభిప్రాయపడింది …మొత్తం మీద వైసీపీ అనుకున్న చర్చ మాత్రం దేశవ్యాపితమైంది …

ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు … ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్ష చేపట్టిన జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు కుమారుడు లోకేశ్ రెడ్‌బుక్ పట్టుకున్న ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్న, చంపుతున్న, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

ఈ రోజు వారు అధికారంలో ఉన్నారని, రేపు తాము అధికారంలోకి వస్తామని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి పాల్పడలేదన్నారు. తామెప్పుడూ ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. కానీ, ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడాలని కోరారు. తాము ప్రదర్శించిన ఫొటోలు, వీడియోలు చూడాలని జాతీయ మీడియాను, నాయకులను జగన్ కోరారు.

యూపీలోను ఏపీ వంటి పరిస్థితులే నెలకొన్నాయి.. ధర్నాకు అఖిలేశ్ యాదవ్ సంఘీభావం

ఏపీలో ఈరోజు జగన్ అధికారంలో లేకపోవచ్చు… రేపు రావొచ్చు, కానీ ప్రతిపక్షాలపై దాడులు సరికాదని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్ జంతర్ మంతర్ వద్ద చేస్తోన్న దీక్షకు అఖిలేశ్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఏపీలో తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు చేస్తోందంటూ అఖిలేశ్‌కు జగన్ వీడియోలు చూపించారు.

అనంతరం అఖిలేశ్ మాట్లాడుతూ… విపక్షాలపై అరాచకాలు సృష్టించడం సరికాదన్నారు. ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇతర పక్షాలపై హింసకు దిగడం సరికాదన్నారు. ప్రాణాలు తీయడం, హత్యలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లవన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలోకి కొత్తగా బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూపీలోను ఏపీ వంటి పరిస్థితులే నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్డోజర్ సంస్కృతికి తాము వ్యతిరేకమని అఖిలేశ్ తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల కోసం జగన్ పోరాడుతున్నారన్నారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం అన్నారు. ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. జగన్ నిరసనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వహాబ్ మద్దతు తెలిపారు.

ఢిల్లీలో జగన్ తో పాటు ధర్నాలో కూర్చున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్

ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణమైన స్థితికి చేరుకున్నాయని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపిస్తూ జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు నేడు ఢిల్లీలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ ధర్నా కార్యక్రమానికి శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ సంజయ్ రౌత్ మద్దతు పలికారు. సంజయ్ రౌత్ నేడు జంతర్ మంతర్ వద్ద వైసీపీ ధర్నాలో పాల్గొన్నారు. జగన్ తో పాటు కూర్చుని ఏపీలో జరిగిన పలు సంఘటనల తాలూకు ఫొటోలను ఆయన పరిశీలించారు. జగన్ ఆయనకు పలు సంఘటనలను వివరించారు.

జగన్ గారూ… ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మీ వెంట నిలుస్తాయి: శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది

ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా మద్దతు పలికారు. జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన వీడియో, ఫొటో ఎగ్జిబిషన్ ను ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికల తర్వాత ఏం జరుగుతోందో అందరికీ తెలిసేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఈ తరహా చైతన్యవంతమైన వాతావరణం (నిరసన ప్రదర్శన) సృష్టించినందుకు విజయసాయిరెడ్డికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వివరించారు.

“వాస్తవానికి రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ఢిల్లీకి తెలిసే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలతో ఢిల్లీ ఎప్పుడో సంబంధాలు కోల్పోయింది. ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటోంది. రాజ్యాంగానికి కూడా విలువ ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు వస్తుంటాయి… పోతుంటాయి. కానీ రాజకీయ హింస ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే.

జగన్ గారూ… ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం… ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మీకు మద్దతుగా నిలుస్తాయి. ఇది ఏపీలో మాత్రమే జరుగుతున్న హింస కాదు, మీ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇలాంటి దారుణాలు ఎదుర్కొనడంలేదు.. దేశమంతా ఇలాగే జరుగుతోంది.

ఏపీలో జరుగుతున్న హింసాత్మక పరిణామాల పట్ల గవర్నర్ జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి. ఏపీ ప్రజల వెంట మేముంటాం, వారి పోరాటానికి మేం మద్దతు పలుకుతాం” అని ప్రియాంక చతుర్వేది ఆవేశంగా ప్రసంగించారు.

Related posts

చంద్రబాబు అరెస్ట్ పై సీ ఓటర్ సర్వే… సంచలన విషయాలు అంటూ వార్త కథనం…

Ram Narayana

జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ అరెస్ట్

Ram Narayana

సీఈసీతో ముగిసిన సమావేశం…. వీళ్లను వదిలేస్తే అరాచకమేనని చెప్పామన్న చంద్రబాబు

Ram Narayana

Leave a Comment