Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కేంద్ర బడ్జెట్‌పై తీర్మానానికి తెలంగాణ శాసన సభ ఆమోదం…

  • కేంద్ర బడ్జెట్‌లో సవరణలు చేయాలని తీర్మానం
  • తీర్మానంపై అభిప్రాయం తెలిపిన పార్టీలు
  • తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు… బీజేపీ వాకౌట్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసన సభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌లో సవరణలు చేయాలని ఈ తీర్మానంలో డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా విభజన చట్టాలను అమలు చేయడం లేదన్నారు. తీర్మానంపై అన్ని పార్టీల నేతలు తమ అభిప్రాయం తెలిపారు. ఈ అంశంపై చర్చను నిరసిస్తూ బీజేపీ సభ్యులు అంతకుముందే శాసన సభ నుంచి వాకౌట్ చేశారు. తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది.

తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరణ చేస్తున్నామన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం సవరించిన బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్ పునరుద్ధరణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పీఎంకేఎస్‌వైలో అనుమతి ఇవ్వాలని, ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన 2,400 మెగావాట్లు నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు.

శాసన సభ తీర్మానం పూర్తి పాఠం ఇదే…

‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణిని కొనసాగించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్రం అవసరమైన, అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది. పార్లమెంట్‌లో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది. 

తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేకసార్లు అభ్యర్థనలను అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా బడ్జెట్‌లో తెలంగాణపై పూర్తిగా వివక్ష చూపింది. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి’ అని శాసన సభ తీర్మానం చేసింది.

Related posts

ఆర్టీసీ అంశంపై అసెంబ్లీలో హరీశ్ రావు వర్సెస్ పొన్నం ప్రభాకర్

Ram Narayana

గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్

Ram Narayana

ప్రజల సెంటిమెంట్‌ను కేసీఆర్ తన ఆర్థిక దోపిడీకి ఉపయోగించుకున్నారు: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment